కేజ్రీపై బూటు...ప్ర‌ధానిపై విమ‌ర్శ‌లు

Update: 2017-01-02 05:29 GMT
ప్ర‌ధానమంత్రి నరేంద్రమోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత-ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌ధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం అని ఆరోపించారు. నోట్ల రద్దు వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని, అంతేకాకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని కేజ్రీవాల్‌ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకొన్న నిర్ణయాన్ని చూసి యావత్ ప్రపంచం నవ్వుకుంటున్నదని అన్నారు. ఈ ప‌రిణామంపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం బీజేపీ - ఆరెస్సెస్ కార్యకర్తలను కూడా నిరుత్సాహానికి గురిచేసిందని ఎద్దేవా చేశారు.

పెద్ద నోట్ల ర‌ద్దుత త‌ర్వాత ఎదురై ఇబ్బందుల నుంచి ప‌రిష్కారంగా తమ అకౌంట్ల నుంచి ఇష్టప్రకారం సొమ్మును విత్ డ్రా చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారని ఆశించిన ప్రజలకు ప్ర‌ధాని ప్ర‌సంగం నిరాశే మిగిల్చింద‌ని కేజ్రీవాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని స్పీచ్‌ లో త‌ను చెప్పాల‌నుకున్న‌ది చెప్పారే త‌ప్ప‌....ఎలాంటి భ‌రోసా ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. నవంబర్ 8 ప్రకటన తర్వాత స్థూల జాతీయ ఉత్పత్తి - వ్యవసాయ - పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించడంపై కేంద్రం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేటీఎం సంస్థకు మేలు కలిగించడానికి నగదు రహిత విధానాన్ని తెరపైకి తెచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఇదిలాఉండ‌గా అరవింద్ కేజ్రీవాల్ పై ఓ యువకుడు బూటు విసిరాడు. అయితే అది గురి తప్పి ఆయనకు సమీపంలో పడింది. ఈ ఘటన హర్యానాలోని రోహతక్ లో చోటుచేసుకొన్నది. ప్రధాని నరేంద్రమోడీ తీసుకొన్న నోట్ల రద్దు అంశానికి వ్యతిరేకంగా తిజోరి తోడ్ బంధా ఫోడ్ అనే పేరు తో నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగం మొదలుపెట్టగానే ఈ ఘటన జరిగింది. మీడియా గ్యాలరీ వైపు నుంచి బూటును విసిరిన యువకుడిని ఆప్ కార్యకర్తలు చితకబాదారు. అనంతరం ఆ యువకుడిని అర్బన్ ఎస్టేట్ పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని దాద్రీ జిల్లాకు చెందిన వికాస్ కుమార్ అని గుర్తించారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పిరికితనానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు. నోట్ల రద్దు ప్రధాని పక్కా ప్రణాళికగా చేపట్టిన కుంభకోణమని తీవ్రంగా దుయ్యబట్టారు. విజయ్ మాల్యా లాంటి బడా కార్పొరేట్లకు బ్యాంకు రుణాలను మాఫీ చేసి దేశంలోని పేద ప్రజలందరినీ బ్యాంకుల ఎదుట క్యూ కట్టించారని మండిపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News