కరోనా వేళ.. ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం

Update: 2020-03-26 11:26 GMT
రాజకీయంగా కావొచ్చు.. వ్యక్తిగతంగా విభేదాలు ఉండటం మామూలే. వాటిని అధిగమిస్తూ నిర్ణయాలు తీసుకోవటం మామూలు విషయం కాదు. మరింత బాగా అర్థం కావాలంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు కలిసి కరోనా మీద కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందా? అలాంటి ఊహను కూడా చాలామంది ఒప్పుకోరు. మరీ.. వీరిద్దరి మధ్య ఉన్నన్ని విభేదాలు కాకున్నా.. ఉప్పు.. నిప్పులా ఉండే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .. ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ లు ఇద్దరూ కలిసి ఈ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన వేళ.. నిత్యవసర వస్తువుల కోసం ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు వీలుగా.. ఢిల్లీ వ్యాప్తంగా 24 గంటలూ నిత్యవసర వస్తువుల షాపులు తెరిచి ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని వారు చెప్పారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని.. ఈ నేపథ్యంలో మరిన్ని చర్యలు అవసరమన్న ఆయన.. దేశ రాజధానిలో గడిచిన 24 గంటల్లో ఒకే ఒక్క కేసు నమోదైందని చెప్పారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 36కుచేరుకున్నట్లైంది.    

ఇప్పటివరకూ ఢిల్లీలో నమోదైన కేసుల్లో అత్యధికం విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి కారణంగానే కావటం గమనార్హం. ఇప్పటికి 36 కేసులు నమోదు కాగా.. అందులో 26 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారే కాగా.. మిగిలిన వారు మాత్రం ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పరిస్థితి అదుపులో ఉందన్న మాట వారి ప్రెస్ మీట్ స్పష్టం చేసింది. మరి.. 24 గంటల పాటు నిత్యవసర దుకాణాలు తెరిచి ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


Tags:    

Similar News