బండ్ల గణేశ్ ను తప్పక అరెస్ట్ చేశారా?

Update: 2019-10-24 05:09 GMT
టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత.. తన నోటి మాటలతో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే బండ్ల గణేశ్ అరెస్ట్ కావటం పాత వార్త. ఆయన అరెస్ట్ కు దారి తీసిన విషయం మాత్రం నిజంగానే కొత్త వార్త. ఎందుకంటే.. ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా బండ్ల గణేశ్ వ్యవహారం ఉందని చెప్పాలి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండే బండ్ల గణేశ్.. అరెస్ట్ కావటానికే పోలీస్ స్టేషన్ కు వచ్చారా? అన్నట్లు పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు.

వారెంట్ ఇచ్చేందుకు వెళ్లే పోలీసులకు సైతం దొరకని బండ్ల గణేశ్.. ఏకంగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. అయితే.. బ్యాడ్ లక్ తరుముతూ రావటం వల్లే అలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

కొద్దిరోజుల క్రితం పీవీపీ ఇంటికి వెళ్లి హడావుడి చేసిన వైనంపై బండ్ల గణేశ్ పై ఆయన ఫిర్యాదు చేయటం.. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేందుకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే.. బండ్లకు తెలీని విషయం ఏమంటే.. తన మీద ఉన్న ఒక చెక్కు బౌన్స్ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెనెన్స్ కోర్టు న్యాయమూర్తి ఈ నెల 18న బండ్ల గణేశ్ కు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు.

అయితే.. తనకిచ్చిన వారెంట్ ను తీసుకోకుండా తప్పించుకుంటున్న బండ్ల గణేశ్.. ఒక విషయాన్ని మిస్ అయ్యారు. వేరే కేసులో తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వేళలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అవగాహన లేకపోవటంతో స్టేషన్ కు వెళ్లి బుక్ అయ్యారంటున్నారు. అంతేకాదు.. పీవీపీ ఇష్యూలో అందుబాటులో లేకుండా పోయారని పోలీసులు చెబుతున్న దానికి భిన్నంగా.. బండ్ల గణేశ్ హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వేర్వేరు కార్యక్రమాలకు హాజరుకావటం..ఇందుకు సంబంధించిన వార్తలు పేపర్లలో పబ్లిష్ కావటంతో పోలీసులు ఇబ్బందికి గురి అవుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలన్న ఆదేశంతో ఆయన రాక తప్పింది కాదు. వివరణ ఇచ్చి వెళ్లాలనుకున్న బండ్ల  స్టేషన్ కు వచ్చినంతనే.. టీవీ ఛానళ్లలో భారీ ఎత్తున బ్రేకింగ్ న్యూస్ పడిపోవటం.. బండ్లకు వారెంట్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలా? అని ఎదురుచూస్తున్న కడప పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు జూబ్లీహిల్స్ స్టేషన్ కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తాను ఒకటనుకుంటే మరొకటి జరగటంతో బండ్ల షాక్ తిన్నారంటున్నారు. బుధవారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి కడపకు తీసుకెళ్లి.. అక్కడి కోర్టులో హాజరుపరుస్తారని.. ఈ రోజే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఏదో చేద్దామనుకున్న బండ్లకు మరేదో అయ్యిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News