ఆ డిప్యూటీ సీఎం అరెస్టు త‌ప్ప‌దా?

Update: 2022-08-27 06:03 GMT
బిహార్‌లో త‌మ‌ను కాద‌ని మాజీ సీఎం లాలూప్ర‌సాద్ యాద‌వ్ కు చెందిన రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ)తో పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోందా అంటే అవున‌నే అంటున్నారు. బిహార్ ఉప ముఖ్య‌మంత్రి, లాలూప్ర‌సాద్ యాద‌వ్ చిన్న కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంద‌ని చెబుతున్నారు. రైల్వే ఉద్యోగాల కుంభ‌కోణంలో తేజ‌స్వీ యాద‌వ్ ను అరెస్టు చేస్తార‌ని జాతీయ మీడియా పేర్కొంటోంది.

2004లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో లాలూప్ర‌సాద్ యాద‌వ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలో ప‌లు రైల్వే జోన్ల‌లో ప‌లువురిని అక్ర‌మంగా నియ‌మించారు. ఇందుకు వారి నుంచి డ‌బ్బులు తీసుకోకుండా గిప్ట్ డీడ్ల రూపంలో స్థ‌లాల‌ను రాయించుకున్నారు.

లాలూప్ర‌సాద్ యాద‌వ్ ఆదేశాల‌తో అక్ర‌మంగా ఉద్యోగాలు పొందిన వారు ఆయ‌న కుటుంబ స‌భ్యుల పేరిట స్థ‌లాల‌ను గిప్ట్‌లుగా రాసిచ్చారు. సీబీఐ ద‌ర్యాప్తులో 16 మంది అభ్య‌ర్థుల‌కు సంబంధించిన ఆధారాలు ల‌భించాయి.

ఉద్యోగాలు పొందిన అభ్య‌ర్థులు లాలూప్ర‌సాద్ యాద‌వ్ కుమారులు.. తేజ‌స్వీ యాద‌వ్, తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ (ప్ర‌స్తుతం బిహార్ ప్రభుత్వంలో మంత్రి), కుమార్తె.. మీసా భార‌తి త‌దిత‌రుల పేరిట స్థ‌లాల‌ను లంచం కింద రాసిచ్చార‌ని సీబీఐకి పక్కా ఆధారాలు ల‌భించాయి. ఈ నేప‌థ్యంలో వీరి ముగ్గురిని అరెస్టు చేయ‌డం ఖాయ‌మేనంటున్నారు. ఇప్ప‌టికే లాలూప్ర‌సాద్ యాద‌వ్ గ‌త కొన్నేళ్లుగా జైలుకే ప‌రిమిత‌మ‌య్యారు. ఇటీవ‌ల ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది.

బిహార్‌లో ఆర్జేడీ అంత‌కంత‌కూ బ‌లోపేతం కావ‌డం, బీజేపీతో స‌మానంగా సీట్లు సాధించ‌డం, తాజాగా నితీష్ కుమార్ మ‌ద్దతు ప్ర‌క‌టించ‌డం, నితీష్ ప్ర‌భుత్వంలో చేర‌డం వంటి కార‌ణాల‌తో బీజేపీ అధిష్టానం మండిప‌డుతోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో లాలూప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యులు, త‌న‌య జైలుకు పోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ వ్య‌వహారాల‌ను న‌డిపిస్తూ, భావి ముఖ్య‌మంత్రిగా కొనియాడ‌బ‌డుతున్న లాలూ చిన్న‌కుమారుడు తేజ‌స్వీ యాదవ్‌ను సీబీఐ అరెస్టు చేస్తుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే త‌ర‌చూ బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం, బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌తో మంత‌నాలాడ‌టం వంటి ప‌నులు చేస్తున్న జార్ఖండ్ ముఖ్య‌మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్‌కు బీజేపీ తాజాగా షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఎమ్మెల్యేగా, ముఖ్య‌మంత్రిగా ఉంటూ మ‌ళ్లీ ప్ర‌భుత్వ లీజుల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని.. ఇలా రెండు లాభ‌దాయ‌కమైన‌వాటిలో ఉండ‌కూడ‌ద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీంతో ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ర‌ద్దు చేసింది. ఇప్పుడు ఇక బీజేపీ త‌న ఆటను బిహార్‌లో మొద‌లుపెట్టింద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News