మూడో కన్ను తెరవాల్సిందేనా... ?

Update: 2021-11-21 04:30 GMT
ఏపీ రాజకీయాలు ఇపుడు దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తున్నాయి. ఒకనాడు అరాచకత్వం, దారుణం అంటూ కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పుకునేవారు. ఇపుడు అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఏపీలో మాత్రం నిత్యం అగ్గి మండుతూనే ఉంది. తగ్గేదిలే అంటూ ఎవరికి వారు అటూ ఇటూ మోహరించారు. ఏపీలో రెండు పక్షాలు, ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు ఇలా అంతా రెండుగానే రాజకీయం టోటల్ గా  విడిపోయింది. ఆఖరుకు ఇది ఎంతదాకా వచ్చిందంటే కొన్ని వ్యవస్థలు కూడా ఇలానే నిట్టనిలువుగా  చీలిపోయి ఈ రాజకీయానికి  అద్దం పడుతున్నాయి. ఈ నేపధ్యంలో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అని ఏపీ గురించి తెలిసిన వారు తాము మంచి చేయాలనుకున్నా చేయకుండా వెళ్లిపోయే స్థితి ఉంది.

ఇక ఏపీ పేరు చెబితే జగన్ చంద్రబాబులేనా ఇంకేవరూ లేరా అన్న చర్చ కూడా ఉంది. ఏపీ అంటే అయిదు కోట్ల మంది ప్రజలు, ఎందరో మేధావులు, చదువరులు ఉన్న ప్రాంతం. కష్టించి పనిచేసే తత్వం ఉన్న వారు పుట్టిన నేల. ఏపీకి సహజ వనరులు ఉన్నాయి. మానన వనరులు ఉన్నాయి. అభివృద్ధి ఎంతగా చేసినా ఆకాశమే హద్దు అన్నట్లుగా చేసుకునే వీలు ఉంది. కానీ ఏపీ ఎందుకు వెనకబడిపోతోంది. అప్పుల ఆంధ్రాగా ఎందుకు పేరు పడిపోతోంది. ఆంధ్రులు అంటే ఇంతే అని బయట వారు చులకనగా ఎందుకు చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

ఏ వ్యవస్థ అయినా బాగుపడాలి అంటే రాజకీయం సక్రమంగా ఉండాలి. కానీ చిత్రమేంటి అంటే ఏపీ రాజకీయం మాత్రం రెండు కుటుంబాలు పార్టీల చుట్టూనే తిరుగుతోంది. నేను కాకపోతే నా వారూ అన్నట్లుగానే పరిధి పెట్టేసుకుని రాజకీయం చేస్తున్నారు.  ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో అత్యంత సహజంగా వచ్చే ఓటములను కూడా స్వీకరించలేకపోతున్నారు. ఇక ఓడిన వారు అయితే తమ కుర్చీని ఎవరో లాగేశారు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూంటే గెలిచిన వారు తామే శాశ్వతం అన్నట్లుగా అతిశయం ప్రదర్శిస్తున్నారు.

మొత్తానికి ఏపీ రాజకీయం మారాలి అంటే ఏ మూడవ పక్షం కానీ కొత్త ఆల్టర్నేషన్ కానీ రావాల్సి ఉందని అంటున్నారు. అది బలమైన వ్యక్తుల  సమూహామా, లేక కొన్ని పార్టీల సమ్మేళనమా. లేక పరిస్థితుల నుంచి పుట్టుకు వచ్చే సరికొత్త నాయకత్వమా  అన్నది ఇప్పటికిపుడు ఎవరూ చెప్పలేరు కానీ అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్న ఈ రెండు పక్షాల రాజకీయ రంగుల రాట్నం కొనసాగినంతకాలం ఇలాగే ఉంటుంది అన్న చర్చ అయితే మేధావుల నుంచి వస్తోంది. మరి కొత్త రాజకీయానికి ఆహ్వానం పలకాల్సింది ప్రజానీకమే అన్న మాటా ఉంది.

ఇక ఎవరికో నొప్పి తగిలితే జనాలు ఎందుకు అబ్బా అని అరవాలి, వారి ఏడుపులు చాలానే ఉన్నాయి. వారి సమస్యలు సాగరమంత ఉన్నాయి. వాటిని పట్టించుకోని నాయకులు తమ పర్సనెల్ అజెండాను ముందు పెట్టి జనాలను జై కొట్టమంటే ఎందుకు కొట్టాలి అన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నారు. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏపీ జనాలకు సరైన ఆల్టర్నేషన్ చూపించాల్సిన బాధ్యత మిగిలిన పార్టీల మీద ఉంది  ఈ రెండు పార్టీలతో అలయెన్స్ కంటే కూడా తామే ముందుకు వచ్చి జనం అజెండాగా చేసుకుని కదిలితే తప్పకుండా ఆదరణ దక్కుతుంది అన్న విశ్లేషణలూ ఉన్నాయి. మొత్తానికి ఏపీ జనాలు అయితే మూడవ కన్ను తెరవాల్సిన టైమ్ అయితే వచ్చేసినట్లే అంటున్నారు.
Tags:    

Similar News