క్రైం థిల్ల‌ర్ మూవీని ను త‌ల‌పించే రియ‌ల్ క్రైం

Update: 2017-06-15 05:09 GMT
ఆ మ‌ధ్య‌నే వ‌చ్చిన ధృవ సినిమా గుర్తుందా? ఇందులో ఒక వ్య‌క్తిని యాక్సిడెంట్ చేసి.. ఆగంత‌కులు ఒక‌రిని దారుణంగా చంపేస్తారు. ఆ చంప‌టానికి కార‌ణం వేరే ఉంద‌న్న విష‌యం హీరో రివీల్ చేసిన‌ప్పుడు ప్రేక్ష‌కుడు షాక్‌కు గురి అవుతాడు. దాదాపు ఇలాంటి రియ‌ల్ ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. హైద‌రాబాద్ లో ఒక ఆత్మ‌హ‌త్య (అనుమానాస్ప‌ద మ‌ర‌ణం).. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే హైద‌రాబాద్‌కు దూరాన ఉన్న సిద్దిపేట జిల్లా కుకునూర్ ప‌ల్లి పోలీస్ క్వార్ట‌ర్స్ లో ఎస్సై ఆత్మ‌హ‌త్య‌.

నిజానికి రెండింటికి ఎలాంటి సంబంధం లేద‌నిపిస్తుంది. ఎందుకంటే.. హైద‌రాబాద్ లో అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించిన మ‌హిళ బ్యూటీషియ‌న్. సిద్ధిపేట జిల్లాలో స‌ర్వీసు రివాల్వ‌ర్‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది ఎస్సై. ఇద్ద‌రికి ఎలాంటి పూర్వ ప‌రిచ‌యం లేదు. మ‌రి అలాంట‌ప్పుడు వీరిద్ద‌రి చావులకు లింకు ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ.. లింకు ఉంద‌న్న విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన ఈ రియ‌ల్ క్రైంను చూస్తే.. అంతా అర్థ‌మైన‌ట్లే ఉండి.. ఏమీ అర్థం కాన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. అదే స‌మ‌యంలో బోలెడ‌న్ని సందేహాలు వ‌చ్చేస్తుంటాయి. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని వివిధ మీడియాల‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌తో ఏర్చికూరిస్తే..

బుధ‌వారం మ‌ధ్య‌హ్నం సిద్ధిపేట జిల్లా కుకునూర్ ప‌ల్లి ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌ర్వీసు రివాల్వ‌ర్‌ తో కాల్చుకొని చ‌నిపోయారు. ఇదే పోలీస్ స్టేష‌న్లో ఆయ‌న‌కు ముందు ఎస్ ఐగా ప‌ని చేసిన వ్య‌క్తి కూడా అధికారుల వేధింపులు త‌ట్టుకోలేక ఇదే రీతిలో స‌ర్వీసు రివాల్వ‌ర్‌ తో కాల్చుకొని చ‌నిపోయారు. దీంతో.. తాజా ఉదంతం షాకింగ్ గా మారింది.

క‌ట్ చేస్తే.. దీనికి ఒక‌టిన్న‌ర రోజుల ముందు.. హైద‌రాబాద్ లోని ఆర్ జే ఫోటోగ్ర‌ఫీ స్టూడియోలో ప‌ని చేసే మేక‌ప్ ఆర్టిస్ట్ క‌మ్ హెచ్ ఉద్యోగి శిరీష అనుమానాస్ప‌ద రీతిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వాస్త‌వానికి ఈ రెండు ఉదంతాల‌కు లింకు ఉంద‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ.. శిరీష ఆత్మ‌హ‌త్య కేసును విచారించే క్ర‌మంలో పోలీసులు.. స్టూడియో య‌జ‌మాని రాజీవ్ మొబైల్ ఫోన్ ను ప‌రిశీలించించ‌టంతో కొత్త కోణం బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. కుకునూరు ఎస్ ఐ ఆత్మ‌హ‌త్య‌కు లింకు వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  

తాజాగా బ‌య‌ట‌కు వస్తున్న స‌మాచారంలో ఎంత నిజం? ఎంత అబ‌ద్ధ‌మ‌న్న‌ది ఇప్ప‌టికిప్పుడు డిసైడ్ చేయ‌టం త‌ప్పే అవుతుంది. ఎందుకంటే.. ఈ రెండు ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంపై పోలీసులు సేక‌రించిన స‌మాచారం చాలా చాలా అప‌రిప‌క్వంగా.. స‌మాచార‌లేమితో.. సందేహాల‌తో నిండి ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఒక‌టి ఓకే అనుకున్నంత‌నే.. మ‌రో విష‌యానికి సంబంధించి ఎందుకిలా? అన్న సందేహం రావ‌టం.. దానికి సంతృప్తిక‌ర స‌మాధానం రాని ప‌రిస్థితి నెల‌కొంది. అస‌లు ఈ మొత్తం వ్య‌వ‌హారంపై వినిపిస్తున్న భిన్న వాద‌న‌ల్ని ఒక్క‌సారి మొద‌టి నుంచి చూస్తే.. మొద‌ట శిరీష్ నుంచి మొద‌లు పెట్టాలి.

హైద‌రాబాద్ శ్రీకృష్ణ న‌గ‌ర్‌ కు చెందిన అరుమిల్లి విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ శిరీష (28) ఆర్ జే ఫోటోగ్ర‌ఫీ సంస్థ‌లో మేక‌ప్ ఆర్టిస్ట్ గా.. హెచ్ ఆర్ నిర్వాహ‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆమె భ‌ర్త స‌తీష్ చంద్ర బేగంపేట‌లోని ఒక పాఠ‌శాల‌లో చెఫ్‌గా ప‌ని చేస్తున్నారు. వారికో కుమార్తె ఉంది. ఇక‌.. శిరీష ప‌ని చేసే ఆర్ జే ఫోటోగ్ర‌ఫీ స్టూడియో విష‌యానికి వ‌స్తే.. దీన్ని హైద‌రాబాద్ కు చెందిన వ‌ల్ల‌భ‌నేని రాజీవ్ అనే వ్య‌క్తి నిర్వ‌హిస్తున్నారు. ఫిలింన‌గ‌ర్ లోని షేక్ పేట మొయిన్ రోడ్డు మీద ఉన్న ఒక అపార్ట్ మెంట్లో ఈ స్టూడియోను నిర్వ‌హిస్తున్నారు.

స్టూడియో య‌జ‌మాని రాజీవ్‌ కు.. మేక‌ప్ ఆర్టిస్ట్ శిరీష‌కు వివాహేత‌ర సంబంధం లాంటిది ఏదన్న ఉందన్న కోణం లో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారట . ఇదిలా ఉంటే.. కొద్ది నెల‌ల కింద‌ట ఒక ఐటీ కంపెనీ హెచ్ ఆర్ లో ప‌ని చేసే తేజ‌స్వినితో రాజీవ్‌ కు ప‌రిచ‌య‌మైంది. ఆమెకు రాజీవ్ ద‌గ్గ‌రైన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఆగ్ర‌హానికి గురైన శిరీష.. రాజీవ్ ను నిలదీసిందా అనే కోణం లో కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు . తేజ‌స్విని వ్య‌వ‌హారాన్ని రాజీవ్ కాని వ‌ద‌ల‌కుంటే పోలీసుల దృష్టికి విష‌యం తీసుకెళ‌తాన‌ని శిరీష హెచ్చ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

దీంతో.. ఈ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేందుకు రాజీవ్ త‌న స్నేహితుడు శ్ర‌వ‌ణ్ ను సాయం కోరిన‌ట్లుగా తెలుస్తోంది. రాజీవ్‌.. శిరీష‌ల మ‌ధ్య‌నున్న వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు త‌న‌కు బాగా తెలిసిన కుకునూరుప‌ల్లి ఎస్ ఐ  ప్ర‌భాక‌ర్ రెడ్డి ద‌గ్గ‌ర సెటిల్ చేద్దామ‌ని శ్ర‌వ‌ణ్ స‌ల‌హా ఇవ్వటంతో  సోమ‌వారం రాత్రి ఈ ముగ్గురు (రాజీవ్‌.. శిరీష‌.. శ్ర‌వ‌ణ్‌) కుకూనుప‌ల్లికి వెళ్లారు. ఇందుకోసం రాజీవ్ కు చెందిన ఎండీవ‌ర్ కారులో వెళ్లారు. వారు కుకునూరు ప‌ల్లికి చేరుకునే స‌రికి రాత్రి 9.30 గంట‌లు అయిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి ఒక గంట ముందు భ‌ర్త‌కు ఫోన్ చేసిన శిరీష తాను ఆల‌స్యంగా వ‌స్తాన‌ని.. ఆఫీసులో ప‌ని ఉంద‌ని చెప్పిన‌ట్లుగా ఆమె భ‌ర్త చెబుతున్నారు.

అర్థ‌రాత్రి వ‌ర‌కూ ఎస్ ఐ ద‌గ్గ‌ర పంచాయితీ జ‌రిగిన త‌ర్వాత సుమారు ఒంటిగంట (సోమ‌వారం అర్థ‌రాత్రి) ప్రాంతంలో హైద‌రాబాద్‌ కు బ‌య‌లుదేరారు. 1.40 గంట‌ల వేళ‌లో తాను శామీర్ పేట ప్రాంతంలో ఉన్న‌ట్లుగా త‌న భ‌ర్త స‌తీష్ చంద్ర‌కు శిరీష వాట్స‌ప్ లొకేష‌న్ పంపింది. దీన్ని చూసిన స‌తీష్ ఫోన్ చేసినా ఆమె స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు ఫోన్ చేసినా స్పందించ‌లేద‌ని అత‌ను చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తెల్ల‌వారుజామున మూడు గంట‌ల ప్రాంతంలో రాజీవ్‌.. శిరీష‌.. శ్ర‌వ‌ణ్‌ లు స్టూడియో వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. మార్గ‌మ‌ధ్యంలో వీరి మ‌ధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు. స్టూడియో వ‌ద్ద‌కు రాగానే విసురుగా లోప‌లికి వెళ్లిపోగా.. ఇబ్బందిక‌రంగా ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో శ్ర‌వ‌ణ్ త‌న దారిన తాను వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. కాసేప‌టికి రాజీవ్ పైకి వెళ్ల‌గా.. చున్నీతో శిరీష ఊరి వేసుకోవ‌టాన్ని గుర్తించిన‌ట్లుగా అత‌ను చెబుతున్నాడు. ఆ వెంట‌నే.. క‌త్తెర‌తో చున్నీని క‌ట్ చేసి ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా.. ఆమె అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లుగా వైద్యులు నిర్దారించారు. దీంతో.. పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ఇది జ‌రిగిన ఒక‌టిన్న‌ర రోజుకు కుకునూరు ప‌ల్లి ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న స‌ర్వీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఈ మొత్తం ఉదంతంపై బోలెడ‌న్ని సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో  కీల‌క‌మైంది..కుకునూర్ ఎస్ ఐ వ‌ద్దకు ఎలాంటి సెటిల్ మెంట్ కోసం ముగ్గురు వెళ్లారు? అన్న‌ది కీల‌క‌ ప్ర‌శ్న. ఇక‌.. రాజీ కోసం అంత రాత్రి వేళ శిరీష వెళ్ల‌టానికి ఎందుకు సిద్ధ‌మైంది? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. సెటిల్ మెంట్ కోసం వెళ్లిన త‌ర్వాత‌.. వారు తిరిగి హైద‌రాబాద్ బ‌య‌లుదేరి వెళ్ల‌టానికి మ‌ధ్య ఏం జ‌రిగింద‌న్న‌ది మ‌రో పెద్ద ప్ర‌శ్న‌.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. కుకునూరుప‌ల్లికి వెళ్లే ముందు భ‌ర్త‌కు ఫోన్ చేసి ఆఫీసులో ప‌ని ఉంద‌ని చెప్పిన శిరీష‌.. అర్థ‌రాత్రి 1.40 గంట‌ల స‌మ‌యంలో భ‌ర్త‌కు తాను ఉన్న శామీర్ పేట లొకేష‌న్‌ను ఎందుకు పంపిన‌ట్లు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. అంత రాత్రివేళ‌.. అంత ర‌చ్చ జ‌రిగిన త‌ర్వాత స్టూడియోలోకి విసురుగా శిరీష వెళ్లిపోగా.. శ్ర‌వ‌ణ్ త‌న దారిన తాను వెళ్లిపోవ‌టంపై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని శిరీష్ భ‌ర్త చెబుతున్నారు. శిరీష ఆత్మ‌హ‌త్య చేసుకున్న వార్త మీడియాలోకి రాగానే కుకునూరుప‌ల్లి ఎస్ ఐ ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకున్నార‌న్న‌ది ఇప్పుడు మ‌రో సందేహం వెంటాడుతోంది. పోలీసుల వృత్తిలో పైకి చెప్పినా.. చెప్ప‌కున్నా ప‌లు పంచాయితీలు చేయ‌టం మామూలే. అలాంట‌ప్పుడు ఈ ఉదంతానికే ఎస్ ఐ ఆత్మ‌హ‌త్య చేసుకుంటారా? అన్న‌ది మ‌రో సందేహంగా మారింద‌ని చెబుతున్నారు. శిరీష మృత‌దేహాన్ని ప‌రిశీలించిన ఫోరెన్సిక్ వైద్యులు ఆమె పెద‌వుల‌తో పాటు.. ముఖంపై గాట్లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. వాటి వెనుక అస‌లు కార‌ణం ఏమిటి? అన్న‌ది మ‌రో సందేహం మారింది. ఈ సందేహాల‌న్నీ ఒక కొలిక్కి వ‌స్తే త‌ప్పించి.. ఈ రెండు ఆత్మ‌హ‌త్య‌ల వెన‌కున్న అస‌లు విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News