తూచ్.. నేనలా అనలేదన్న సిద్ధరామయ్య

Update: 2018-06-30 08:13 GMT
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడి పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడలో ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ కావడంతో  నాలుక కరుచుకున్నారు. వెంటనే మీడియా ముందుకొచ్చి కాంగ్రెస్-జేడీఎస్ బంధం ధృడంగా ఉందని.. ఐదేళ్లపాటు ప్రభుత్వం ఉంటుందంటూ గొంతు సవరించుకున్నారు.  

బెంగళూరులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాని హాజరైన అనంతరం ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి  సిద్ధరామయ్య  వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం  ఐదేళ్లు పాలన సాగించడం కష్టమని పేర్కొన్నారు.దీన్ని ఎవరో వీడియో తీసి లీక్ చేశారు.  దుమారం రేగడంతో  కవర్ చేసే ప్రయత్నం చేశారు. ‘ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశానో మీకెవరికి తెలియదు. మామూలుగా పిచ్చాపాటీగా మాట్లాడే సమయంలో ఎవరో రికార్డు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ ’ సిద్ధరామయ్య చురకలు అంటించాడు. ఇలా వీడియో టేపులను  విడుదల చేయడం విలువలతో కూడిన పని కాదన్నారు. అయితే ఎవరు రికార్డు చేశారన్నది మాత్రం సిద్ధరామయ్య బహిర్గతం చేయలేదు.

ఈ లీక్ అయిన వీడియోల్లో సిద్ధరామయ్య పలు సంచలన కామెంట్స్ చేశాడు. సీఎం కుమారస్వామి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సిద్ధరామయ్య ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సరిపోతుంది కాదా అని ఆయన అన్నారు.  చూస్తుంటే ఈ జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన కామెంట్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై వివరణ ఇచ్చి తప్పుకున్నారు. 
Tags:    

Similar News