నోరు జారిన సిద్దరామయ్య..మోడీకి ఓటెయ్యండి

Update: 2018-05-08 12:57 GMT
హోరాహోరిగా సాగుతున్న క‌ర్ణాట‌క‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో  గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ సీఎం అభ్యర్థి యడ్యూరప్పది అవినీతి ప్రభుత్వం అని నాలుక కరుచుకున్న సంద‌ర్భం గుర్తుండే ఉంటుంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడే త‌మ పాల‌న‌లోని అవినీతిని వెల్ల‌డించార‌ని పేర్కొన్నాయి. దీంతో ఎట్ట‌కేల‌కు అమిత్‌షా వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడు సీఎం సిద్దరామయ్య అలాగే నోరు జారారు. ఏకంగా ప్ర‌ధాని మోడీకి ఓటు వేయాల‌ని కోరారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థి నరేంద్ర స్వామి తరఫున ఆయన ప్రచారం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి నరేంద్ర స్వామి వల్లే సాధ్యమైంది అనబోయి.. నరేంద్ర మోడీ వల్లే అని నోరు జారారు. తర్వాత నవ్వుతూ దానిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ నరేంద్ర అన్నది ముఖ్యం అని సిద్దరామయ్య అన్నారు. `స్వామి ఇక్కడున్నారు.. మోడీ గుజరాత్‌లో ఉంటారు. నరేంద్ర మోడీ కల్పితమైతే.. ఈ నరేంద్ర స్వామి నిజం` అని ఆయన చెప్పారు. ఆయన కన్నడలో మాట్లాడిన ఈ మాటలను టైమ్స్ నౌ ట్వీట్ చేసింది. క‌ర్నాట‌ ఎన్నికల్లో నేతలు నోరు జారుతున్నారని అంటున్నారు.

కాగా, క‌న్న‌డ ఎన్నిక‌ల్లో స‌ర్వం తానే అయి సిద్ధ‌రామ‌య్య వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచినా ఓడినా.. ఈ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం సీఎం సిద్దరామయ్య తన సొంతం చేసుకున్నారు. మొత్తం రాష్ర్టానికి మస్కట్‌గా గుర్తింపు పొందడం దగ్గర్నించి.. ప్రధాని మోడీకి ట్విట్టర్‌లో సవాళ్లు విసరడం వరకు..కన్నడ ఎన్నికల సమరం తనకు ఇతరులకు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకొచ్చారు. ఆయన ఎన్నికల ఎజెండాను సెట్ చేస్తూ ఇతరులు దానికి స్పందించేలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ ఆలోచనలకు, వ్యూహాలకు సిద్దరామయ్య ఎక్కడా చిక్కడం లేదు. దీంతో ప్రతిపక్షం ఆయన లోపాలను ఎత్తిచూపలేకపోతోంది. వ్యక్తిగతంగా సిద్దరామయ్యపై అవినీతి ఆరోపణలు చేయడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. అదేసమయంలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప నిజాయితీపరుడు అని ప్రకటించుకోలేని పరిస్థితి ఎదురైంద‌ని అంటున్నారు.  ప్రత్యేక జెండా.. హిందీ వ్యతిరేక ఉద్యమం.. కర్ణాటకలో కన్నడ భాషకే అగ్రస్థానం కల్పించడం వంటి అంశాలతో సీఎం సిద్దరామయ్య హిందూత్వ పోలరైజేషన్‌ను (కేంద్రీకరణ వ్యూహాన్ని) విజయవంతంగా దెబ్బతీయగలిగారు. కొన్ని జిల్లాల్లో మినహా యూపీ తరహా హిందూత్వ పోలరైజేషన్ కర్ణాటకలో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని బీజేపీ భావిస్తోంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View
Tags:    

Similar News