మోడీకి ఊహించ‌ని షాక్ ఇవ్వ‌నున్న ఆ సీఎం?

Update: 2017-04-18 07:34 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయో చెప్ప‌లేం. ఓ చిన్న ప‌రిణామం మొత్తంగా మారిపోయేలా చేస్తుంది. తాజాగా క‌ర్ణాట‌క రాజ‌కీయాలు ఇదే తీరులో మార‌నున్నాయ‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అధికార‌ప‌క్షానికి స‌హ‌జ‌సిద్ధంగా ఉండే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు భిన్నమైన ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న విష‌యం అర్థ‌మ‌య్యాక.. ఏ అధికార‌ప‌క్షం మాత్రం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌దు? దేశ వ్యాప్తంగా మోడీ గాలి జోరుగా వీస్తోంద‌న్న ప్ర‌చారం భారీగా సాగుతున్న వేళ‌.. అందుకు భిన్న‌మైన ఫ‌లితాలు రావ‌టం క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌ల్లో ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

షెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చే మేలో క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. అంత వ‌ర‌కూ టైం ఇవ్వ‌కుండా.. తాజాగా నెల‌కొన్న సానుకూల ప‌రిస్థితుల్ని వినియోగించుకుంటూ త‌మ చేతిలో ఉన్న అధికారాన్ని మ‌రికొంత కాలం పొడిగించుకునేలా చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఐదేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తి అయిన త‌ర్వాతే తాము ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌ట్లుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా వెలువ‌డిన రెండు ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో (నంజనగూడ - గుండ్లుపేట) పార్టీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. ఈ ఏడాది చివ‌రికి ఎన్నిక‌ల‌కు వెళితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న మొద‌లైన‌ట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నా.. ఎంత‌కూ అంతుచిక్క‌ని రీతిలో ద‌క్షిణాది  ప్రాంతం క‌మ‌ల‌నాథుల‌కు ఉండిపోయింది.

ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లో త‌మ‌కున్న బ‌లంతో ప‌వ‌ర్ లోకి రాగ‌లిగితే.. ద‌క్షిణాదిని వ‌శం చేసుకునే కార్య‌క్ర‌మాన్ని క‌ర్ణాట‌క‌తో షురూ చేయాల‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు.  ఇందుకు త‌గ్గ‌ట్లే వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. అయితే.. అందుకు భిన్న‌మైన ఎత్తుగ‌డ‌తో  త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు షాకివ్వాల‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య భావిస్తున్న‌ట్లుగా చెబుతున‌నారు. తాజాగా వెలువ‌డిన ఉప ఎన్నిక‌ల ఫ‌లిత‌ల విజ‌యంతో మాంచి ఊపు మీదున్న పార్టీ క్యాడ‌ర్‌ ను ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం చేయ‌టం చాలా తేలిక‌న్న వాద‌న‌ను కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి వివ‌రించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ సిద్ధ‌రామ‌య్య మాట‌ల‌కు కాంగ్రెస్ అధినేత్రి క‌న్వీన్స్ అయితే మాత్రం.. ఆస‌క్తిక‌ర రాజ‌కీయానికి తెర లేచిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News