సీఎం చేతిలో ఊస్టింగ్ మంత్రుల జాబితా

Update: 2016-06-16 05:57 GMT
ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మ‌రోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈ ద‌ఫా ఆయ‌న కొత్త సంప్ర‌దాయానికి తెరలేపారు. మంత్రుల ప‌నితీరును స‌మీక్షించి  మొత్తం 33 మందిలో 18 మంది ప‌ద‌వి ఊడ‌బీకేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో వారికి ఓ ప‌రీక్ష కూడా నిర్వ‌హించ‌నుండ‌టం విశేషం.

ఆ రాష్ట్రంలోని పలువురు మంత్రుల పనితీరు పట్ల ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఏశాఖలో ఏమేరకు అభివృద్ధి సాధించారో అర్థంకాని ప‌రిస్థితి. బడ్జెట్‌ లో ప్రకటించిన పథకాల అమలు - ప్రజా సమస్యలకు స్పందించడం - కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధానానికి పలువురు మంత్రులు దూరంగా ఉండిపోతున్నారు.  కొంద‌రు మంత్రులపై కార్యకర్తలు - శాసనసభ్యులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు.ఈ ప‌రిస్థితుల‌ను సిద్ధు గుర్తించి.. ఓ కొలిక్కి తేనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్ట‌డంలో భాగంగా తన మంత్రులంద‌రి రాజీనామాలు తీసుకోవడానికి సిద్ధ‌మ‌య్యారు.

పనిచేసే- ప‌నిచేయని వారి జాబితాలు సిద్ధం చేసి బాధ్యతలు కట్టబెట్టేందుకు ఉపకరించేలా ‘మంత్రి పరిషత్‌’ సమావేశాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఆ సమావేశంలోనే 33 మంది మంత్రుల నుంచి రాజీనామా పత్రాలు స్వీకరించి- వారిలో కొందరిని తరువాత తన ప్రక్షాళన ఘట్టంలో అమాత్యులుగా కొనసాగించాలనేది సిద్ధ‌రామ‌య్య‌ ఆలోచన. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ - పీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ పరమేశ్వర్ హాజ‌రు కానుండ‌టం విశేషం. మంత్రులు త‌మ త‌మ‌ పనితీరుపై పరిషత్‌ లో సమాధానం ఇవ్వాల్సిందిగా సిద్ధు ఆదేశించారు. వారందరి పనితీరుపై అధిష్ఠానానికి నివేదిక అందజేస్తారని స‌మాచారం. అయితే పని చేయని మంత్రులుగా 18 మందిని ఇప్ప‌టికే గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. మంత్రివ‌ర్గ‌ విస్తరణ సమయంలో వారిని పక్కకు పెట్టి కొత్తవారికి పీట వేస్తారనేది సమాచారం. మొత్తంగా పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో జ‌రిగే ఈ కొత్త ప్ర‌యోగం ఏ మేర‌కు స‌ఫ‌లీకృతం అవుతుందో చూడాలి మ‌రి.
Tags:    

Similar News