పొరుగురాష్ట్రంలో సంక్షోభం..వెన‌క ఉన్న‌ది ఆ పార్టీయే

Update: 2018-08-24 16:26 GMT
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో మ‌రోమారు రాజ్యంగ సంక్షోభం త‌లెత్తే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అనేక ట్విస్టుల మ‌ధ్య పట్టాభిషేకం జ‌రిగిన జేడీఎస్ నేత కుమార‌స్వామికి త్వ‌ర‌లోనే ప‌ద‌వీ గండం ఖాయ‌మంటున్నారు. కుంపట్లు - తిరుగుబాట్లు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది.గతంలో క్యాంపు రాజకీయాలను నడుపుతున్నారని ప్ర‌చారం జ‌రిగిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే ప్ర‌స్తుతం ఎత్తుగ‌డ‌ల‌కు కూడా కార‌ణ‌మ‌ని బెంగ‌ళూరు మిర్ర‌ర్ ప‌త్రిక క‌థ‌నం రాసింది. దీనివెనుక క‌ర్ణాట‌క‌లో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ ఉంద‌ని విశ్లేషించింది. ఆయ‌న‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ ను ఎర‌వేసి క‌న్న‌డ సీటుపై క‌న్నేసిందని పేర్కొంది.

వాస్త‌వానికి ప్ర‌భుత్వం ఏర్పాటు స‌మ‌యం నాటి నుంచి జేడీఎస్‌-కాంగ్రెస్‌ ల మ‌ధ్య ఆరోప‌ణ‌ల యుద్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి కుమారస్వామి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా అనంత‌రం వెలువ‌డిన ఓ వీడియోలో నేచురోపతి ట్రీట్‌ మెంట్ తీసుకుంటున్న మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య అక్కడే ఓ వ్యక్తితో సంచ‌న‌ల వ్యాఖ్యలు చేసినట్లుగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తితో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో చెప్పలేమని ఆ వీడియోలో సిద్ధరామయ్య అన్నారు. `అసలు ఈ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకునేది అనుమానమే. లోక్‌ సభ ఎన్నికల తర్వాత ఏమవుతుందో చూద్దాం` అని సిద్ధరామయ్య అనడం గమనార్హం. ఇలా వివిధ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న స‌మ‌యంలో సిద్ద‌రామ‌య్య స‌ర్కారును వంద‌రోజుల్లో కూల్చేసేందుకు ఎత్తుగ‌డ సిద్ధ‌మైన‌ట్లు ఆ క‌థ‌నం తెలుపుతోంది.

ఈ క‌థ‌నం ప్ర‌కారం కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సఖ్య‌త లేక‌పోవ‌డం - త‌న‌కు మ‌రియు త‌న వ‌ర్గానికి స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌నే అసంతృప్తిలో ఉన్న సిద్ధ‌రామ‌య్య‌కు బీజేపీ గాలం వేసిందట‌. సిద్దరామయ్య తనతో పాటు కాంగ్రెస్ పార్టీలోని అసహన నేతలందరితోనూ రాజీనామా చేయిస్తే...ప్ర‌భుత్వం ఏర్పాటు వ్య‌వ‌హారం తాము చూసుకుంటామ‌ని మైనార్టీలో ప‌డిన ప్ర‌భుత్వం అనంత‌రం త‌మతాము స‌ర్కారును ఏర్పాటు చేస్తామ‌ని పార్టీ పెద్ద‌లు హామీ ఇచ్చినట్లు పేర్కొంది. రాబోయే కాలంలో ఆయ‌న‌కు ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తామ‌ని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, గ‌తంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం లేద‌ని జేడీఎస్‌ కు గుడ్‌ బై చెప్పేసిన సిద్ధ‌రామ‌య్య ఈ ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ ప‌రిణామాల‌పై పెద్ద‌గా దృష్టిసారించ‌ని సీఎం కుమార‌స్వామి వారానికో దేవాల‌య సంద‌ర్శ‌న‌తో బిజీగా ఉన్నారు.



Tags:    

Similar News