ఎందుకింత చీప్ గా మాట్లాడాడు సిద్దార్థ్‌?

Update: 2022-01-11 03:02 GMT
సైద్ధాంతిక విభేదాలు మనిషిని ఉత్తనే కూర్చునేలా చేయవు. అదే సమయంలో.. అభిమానం కూడా అలాంటిదే. కాకుంటే.. సభ్య సమాజంలో బాధ్యత కలిగిన హోదాల్లో ఉన్నప్పుడు భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని మిస్ అయినప్పుడు ఇబ్బందులు తప్పవు. తాజాగా ప్రముఖ నటుడు సిద్దార్థ్‌ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. షట్లర్ సైనా నెహ్వాల్ పై నటుడు సిద్దార్థ్‌ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణం కావటమే కాదు.. చట్టబద్ధమైన చర్యల్ని ఆయన ఫేస్ చేయాల్సి వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతకూ సిద్దార్థ్‌ చేసిన తప్పేంటి? అతడిపైన అంతలా ఎందుకు విరుచుకుపడుతున్నారు? నెటిజన్ల ఆగ్రహానికి కారణం ఏమిటి? నిజంగానే సిద్దార్థ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారా? జాతీయ మహిళా కమిషన్ చర్యలకు సిద్ధమయ్యే వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయంలోకి వెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని ఖండిస్తూ బీజేపీ పార్టీ సభ్యురాలైన సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు.
దేశ ప్రధానికే తగిన భద్రత లేనప్పుడు ఆ దేశం క్షేమంగా ఉందని ఎలా అనుకోగలం? ప్రధానిపై ఆరాచక శక్తుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి మోడీపై తనకున్న అభిమానాన్ని.. కాస్త ఆలస్యంగానే ఆమె ట్వీట్ రూపంలో ప్రదర్శించారు. దీనికి స్పందించిన సిద్దార్థ్‌.. కాస్తంత వ్యంగ్యంగా రియాక్టు అయ్యారు. ‘చిన్న కాక్ తో ఆడే ప్రపంచ చాంపియన్.. దేవుడి దయవల్ల భారత్ ను కాపాడేవారు ఉన్నారు’ అని పేర్కొనటం వివాదాస్పదమైంది. అతడి ట్వీట్ లో కాక్ అన్న పదంపై అందరూ భగ్గుమనటమే కాదు.. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ పదాన్ని ప్రయోగించిన సిద్దార్థ్‌ నిజంగానే తప్పుడు ఆలోచనలు లేకుండానే వాడారా? సెటైరిక్ గా వాడారా? అన్న దానిపై సందేహాలు ఉన్నాయి. అయితే.. పబ్లిక్ డొమైన్ లో ఒక వ్యాఖ్య చేసే వేళలో.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. తాజా ఎపిసోడ్ లో సిద్దార్థ్‌ ఆ కీలకమైన అంశాన్ని మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ సిద్దార్థ్‌ను చూస్తే.. మోడీ అండ్ కోపై ఆయనకు ఆగ్రహం ఎక్కువ. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కమ్ క్వీన్ కంగనా రౌనత్.. మోడీని ఎంతలా వెనకేసుకు వస్తారో.. అదే స్థాయిలో సిద్దార్థ్‌ ఆయన్ను వ్యతిరేకిస్తుంటారు. ఇదే.. తాజా వివాదానికి ప్రధాన కారణమని చెప్పాలి. ఒకరి అభిమానం.. మరొకరి ఆగ్రహం కలగలిపితే ఈ రచ్చకు కారణంగా చెప్పక తప్పదు.

సిద్దార్థ్‌ ట్వీట్ లపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సిద్దార్థ్‌ సోషల్ మీడియా అకౌంట్ ను బ్లాక్చేయాల్సిందిగా ట్విటర్ ను కోరింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని మహారాష్ట్ర పోలీసులకు లేఖ రాసింది. ఈ అంశంపై సైనా స్పందిస్తూ.. ‘‘అతడు ఏ ఉద్దేశంతో అన్నాడో స్పష్టంగా అర్థం కాలేదు. ఒక నటుడిగా అతడిని అభిమానిస్తా. కానీ.. ఇదేమాత్రం బాగోలేదు. తన భావాల్ని వ్యక్తపర్చటానికి మరింత మంచి పదాల్నిఉపయోగించి ఉండొచ్చు. ఇలాంటి పదాలు.. వ్యాఖ్యలు నాకు తెలీవు. కానీ.. వాటి అర్థం ట్విటర్.. మీడియాకు తెలిసి ఉండొచ్చని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

ఇక.. ఈ వ్యవహారంపై సైనా భర్త కమ్ షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా రియాక్టు అయ్యారు. సిద్దార్థ్‌ ట్వీట్ ను తప్పు పట్టారు. సిద్దార్థ్‌ మంచి భాషను వాడి ఉండాదల్సిందన్నాడు. తాను చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ.. జాతీయ మహిళా కమిషన్ చర్యలకు ఆదేశించిననేపథ్యంలో సిద్దార్థ్‌ స్పందించారు. తన ట్వీట్ కు తప్పుడు అర్థం అపాదిస్తున్నట్లుగా వెల్లడించారు. తనకు ఎవరినీ కించపర్చాలన్న ఉద్దేశం లేదన్న ఆయన.. ‘కాక్ అండ్ బుల్’ అన్న కోణంతో తాను ట్వీట్ చేశానని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయిందని చెప్పక తప్పదు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేసిద్దార్థ్‌.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఆయన తొందరపాటుతో వ్యవహరించి.. చౌకబారు వ్యాఖ్యల ప్రముఖుడిగా ముద్ర వేయించుకున్నారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News