ట్రంప్ బాట‌లోకి సింగ‌పూర్ వ‌చ్చేసింది!

Update: 2017-04-03 09:23 GMT
ప్ర‌పంచ దేశాల్లోకెల్లా భార‌త్‌ కు చెందిన ఐటీ నిపుణులు అత్యంత ప్ర‌తిభావంతుల‌న్న విష‌యం ఇప్పుడంతా ఒప్పుకున్న‌దే. మైక్రోసాఫ్ట్‌కు స‌త్య నాదెళ్ల‌ - గూగుల్ సుంద‌ర్ పిచాయ్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వైనమే ఇందుకు నిద‌ర్శ‌నం. సాఫ్ట్‌ వేర్ రంగంలో ప్ర‌పంచంలోనే అగ్ర‌గాములుగా నిలిచిన ఈ రెండు సంస్థ‌ల‌కు నేతృత్వం వ‌హిస్తున్న ఇద్ద‌రు కూడా భార‌తీయులే కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. సాంకేతిక ప‌రిజ్ఞానంలో ఇత‌ర దేశాల నిపుణుల క‌న్నా మ‌నం ఎంత మేర స‌త్తా చాటుతున్నా కూడా... మ‌న దేశానికి చెందిన సంస్థ‌లు - ఐటీ నిపుణుల ప‌ట్ల ఆంక్ష‌లు విధిస్తున్న దేశాల సంఖ్య క్ర‌మేణా పెరుగుతోంది. అగ్ర‌రాజ్యంగా ప్ర‌పంచ దేశాలు భావిస్తున్న అమెరికాకు కొత్త అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన డొనాల్డ్ ట్రంప్‌... అమెరికాలోని ఉపాధి అవ‌కాశాలు అమెరికన్ల‌కు మాత్ర‌మే ద‌క్కాలంటూ కొత్త వాద‌న‌ను తెరపైకి తీసుకుని వ‌చ్చి... భార‌త్ స‌హా, ఇత‌ర దేశాల నుంచి అమెరికాకు వ‌ల‌స వెళ్లిన వారిని తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశాయి.

ఈ షాక్ నుంచి తేరుకోక‌ముందే... భార‌త ఐటీ సంస్థ‌ల‌తో పాటు ఐటీ నిపుణుల‌కు మ‌రో దేశం నుంచి ఊహించ‌ని విధంగా షాక్ త‌గిలింది. ఈ షాక్ వినిపించిన దేశం ఎక్క‌డో సుదూరాన ఉన్న దేశం కాదు. దాదాపుగా మ‌నకు పొరుగు దేశంగానే భావిస్తున్న సింగ‌పూర్ దేశ‌మే. తమ దేశంలో ఉన్న భార‌త ఐటీ కంపెనీలు స్థానికుల‌కే అవ‌కాశాలు ఇవ్వాల‌ని సింగ‌పూర్‌ ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది. ఈ క్ర‌మంలో భార‌త ఐటీ ప్రొఫెష‌నల్స్‌కు జారీ చేసే వీసాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించింది. దీంతో ఇండియ‌న్‌ ఐటీ కంపెనీలు ఇత‌ర దేశాల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇది వాణిజ్య ఒప్పందాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని భావిస్తున్న భార‌త ప్ర‌భుత్వం.. కాంప్రెహెన్సివ్ ఎక‌నామిక్ కో-ఆప‌రేష‌న్ అగ్రిమెంట్(సీఈసీఏ) పునఃస‌మీక్ష‌పై పునరాలోచ‌నకు కార్య‌రంగం సిద్ధం చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

సింగ‌పూర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం హెచ్‌ సీఎల్‌ - టీసీఎస్‌ - ఇన్ఫోసిస్‌ - విప్రో - కాగ్నిజెంట్‌ - ఎల్ అండ్ టీ కంపెనీల‌పై ప్ర‌భావం చూపనుంది. ఇది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్నా.. గతేడాది మొద‌టి నుంచీ వీసాల జారీని గ‌ణనీయంగా త‌గ్గించార‌ని, స్థానికుల‌కే ఉద్యోగావ‌కాశాలు ఇవ్వాల‌ని సింగ‌పూర్ ప్ర‌భుత్వం కంపెనీల‌కు స్ప‌ష్టం చేసింద‌ని నాస్కామ్ అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ చెబుతున్నారు. ఎక‌నామిక్ నీడ్స్ టెస్ట్ అంటూ ఆర్థిక కార‌ణాల‌ను సాకుగా చూపుతూ సింగ‌పూర్ భార‌త ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌ కు వీసాల‌ను నిరాక‌రిస్తోంది. సీఈసీఏ ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని భారత్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. అమెరికా, తర్వాత సింగపూర్ కూడా వీసాలు తగ్గించడంపై భారత ఐటీ సంస్థలు, ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News