సిట్ పై యనమల..లాజిక్ కుదరలేదబ్బా!

Update: 2020-02-24 14:30 GMT
టీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి - శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎప్పుడు మాట్లాడినా... ఏదో లాజిక్కును పట్టుకుని వైరి వర్గాలను దంచేస్తుంటారు. అయితే ఎందుకనో గానీ... ఇప్పుడు యనమల లాజిక్ కట్టు తప్పుతోంది. టీడీపీకి ఘోర పరాభవం దక్కడమో - లేదంటే శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం తనను ఇంటిపట్టునే కూర్చోబెట్టేయనుందన్న భయమో తెలియదు గానీ... నేల విడిచి సాము చేసిన మారిది... లాజిక్ లేకుండా యనలమ నిజంగానే ఏదేదో మాట్లాడేస్తున్నారు. రాజకీయ పార్టీలన్నాక... తమ వైరి వర్గాలపై ఓ రేంజిలో విరుచుకుపడటం సర్వ సాధారణమే గానీ... ఆ విరుచుకుపడటంలో లాజిమ్ మిస్ కాకుండా ఆయా పార్టీలు - ఆ పార్టీల నేతలు చూసుకుంటారు. మొన్నటిదాకా యనమల కూడా ఈ లాజిక్ ను బాగానే చూసుకునేవారు గానీ... ఇప్పుడు ఎందుకనో ఆయన లాజిక్ ను అస్సలు పట్టించుకోవడం లేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.

సరే మరి... యనమల లాజిక్ మిస్సై - వైసీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా మిస్ పైర్ అయ్యాయన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. 2014లో నవ్యాంధ్రలో అధికారం చేపట్టి ఐదేళ్ల పాటు పాలన సాగించిన టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణకు జగన్ సర్కారు గత వారం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ను అలా వేశారో, లేదో.... ఇలా టీడీపీ శ్రేణులన్నీ వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డాయి. చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఈ సిట్ పై తనదైన శైలిలో స్పందించి... తనపై కక్షసాధింపుల కోసమే జగన్ సర్కారు సిట్ ను ఏర్పాటు చేసిందని చంద్రబాబు పెద్ద శోకాలే తీశారు. ఇక టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయారు. అసలు తమ ప్రభుత్వంపై ఎలా విచారణ చేస్తారంటూ శోకాలు తీశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న యనమల కూడా మీడియా ముందుకు రాకపోతే బాగుండదేమో అనుకున్నారో, ఏమో తెలియదు గానీ ఆయన కూడా మీడియా మీట్ పెట్టేసి... తనదైన లాజికల్ విమర్శలు చేశారు.

ఇందులో భాగంగా జగన్ పాలన మొదలైన నాటి నుంచి ఆ ప్రభుత్వం తీసుకున్న విధానాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి జగన్ పాలన మొదలై ఇప్పటికి ఏడాది కూడా పూర్తి కాలేదు. జగన్ సీఎం పదవి చేపట్టి 9 నెలలే అవుతోంది. అంటే... యనమల డిమాండ్ ప్రకారం జగన్ తొమ్మిది నెలల పాలనపై విచారణ చేపట్టాలని యనమల డిమాండ్ చేస్తున్నారన్న మాట. జగన్ కు ఇంకా నాలుగేళ్ల 3 నెలల పాటు రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఏడాది కూడా గడవకముందే జగన్ పాలనపై విచారణ అంటూ యనమల చేసిన కామెంట్ పై ఓ రేంజిలో సెటైర్లు పడుతున్నాయి. అసలు జగన్ సర్కారు వేసిన సిట్... ఐదేళ్ల టీడీపీ పాలనపై విచారణ జరపడానికి రంగం సిద్ధమైతే... యనమల ఏమో జగన్ తొమ్మిది నెలల పాలనపై విచారణ అంటూ డిమాండ్ చేయడం చూస్తుంటే... టీడీపీ పాలనపై విచారణకు ఆయన ఓకే చెప్పేసినట్టేనా అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Tags:    

Similar News