బీజేపీ కంటే బాబు నాలుగు ఆకులు ఎక్కువేన‌ట‌

Update: 2016-04-26 13:47 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రేరేపిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై 'సేవ్ డెమోక్రసీ' పేరిట వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఫ‌లితం ఎలా ఉన్నా ప్ర‌చారం మాత్రం బాగానే జ‌రుగుతోంది. త‌న పార్టీకి చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల బృందంతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను జ‌గ‌న్‌ క‌లిశారు. ఈ సందర్భంగా విజ్ఞాపన పత్రం - చంద్ర‌బాబుపై రాసిన 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని కూడా కేంద్ర హోమంత్రికి వైఎస్ జగన్ అంద‌జేశారు. అమరావతి పేరుతో భూముల దోపిడీ - కరెంటు దోపిడీ - ఇసుక మాఫియాలను ఇలా అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఉన్నట్లు స‌మాచారం. పూర్తి ఆధారాలతో - డాక్యుమెంట్లు కూడా ఈ పుస్తకంలో మొత్తం లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఈ పుస్తకంలో పొందుపరిచిన‌ట్లు అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ తెలిపారు. 

అనంత‌రం సీపీఎం ప్రధాన కార్యాలయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి క‌లిశారు. ఏపీలో విచ్చలవిడిగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు - అవినీతి కార్యకలాపాలు సాగుతున్నాయ‌ని ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం జగన్ - ఇతర నేతలతో కలిసి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అవినీతి - దిగజారుడు తనాలను దేశంలో ఎక్కడా చూడలేదని, ఈ వివరాలన్నింటినీ  జగన్ తనకు చెప్పారని తెలిపారు.

ఉత్తరాఖండ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఏపీలో జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని  తెలిపారు. అసలు దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడాన్ని ఎక్కడా చూడలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం - ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి వాళ్లకు పదవులు ఇవ్వడం సరికాదని అన్నారు. చట్టాలను బైపాస్ చేసి ఇలా చేయడం ఆశ్చర్యకరమైన విషయమని, దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే ప్రయత్నం కూడా చేస్తామని అన్నారు.
Tags:    

Similar News