క‌మ్యూనిస్టుల వీర కంక‌ణం.. బీజేపీ ఓట‌మికి కృషి చేస్తార‌ట‌!

Update: 2022-01-09 14:30 GMT
బీజేపీ ఓటమి లక్ష్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కృషి చేస్తామని  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికల్లో ఓట్లలో చీలిక లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. అన్ని విషయాల్లో, రంగాల్లో ప్రధాని నరేంద్రమోడీ విఫలమయ్యారని ఏచూరి విమర్శించారు. సీపీఎం జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానితో సహా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకుండా బీజేపీ పన్నాగం పన్నుతోందని ఆరోపించారు.

బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఏచూరి మండిపడ్డారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ బద్దంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చూడాలన్నారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎన్నికల తర్వాతే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్లో ప్రధాని వెళ్లాల్సిన సమావేశంలో ప్రజలు రాలేదని ఆయన అన్నారు.

 ప్రధాని పర్యటనలో సెక్యూరిటీ లాప్స్ ఉంటే సీరియస్ చర్యలు తీసుకోవాలని ఏచూరి పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయ వాతావరణం నెలకొందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత సమయంలో బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కొవిడ్ను అరికట్టడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మరోపక్క ఆర్థిక సంక్షోభం పెరుగుతోందని, ఉపాధి కల్పన లేదని, పెట్రోలియం ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.

``బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది. ఈ పోరులో కలిసొచ్చే వారిని కలుపుకుంటాం. ప్రత్యామ్నాయ కూటమి ఎన్నికల తర్వాతే ఏర్పాటు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మా మద్దతు సమాజ్‌వాది పార్టీకి ఉంటుంది. పంజాబ్‌లో పరిణామాలు ఆ రాష్ట్రానికే పరిమితం. పంజాబ్‌ పరిస్థితులు దేశం మొత్తం ఉన్నట్లు కాదు. హెలికాప్టర్ వెళ్లే పరిస్థితి ఉండగా మోడీ కారులో ఎందుకు బయలుదేరారు. ఆరోజు మోడీ సభకు జనం అంతగా రాలేదు. నిజంగా భద్రతా లోపాలను మాత్రం ఎవరూ సహించరు. ఇప్పటికే కొందరు కీలక నేతలను మనం కోల్పోయాం. భద్రతా లోపంతో నేతలను కోల్పోయే పరిస్థితి మళ్లీ రావొద్దు.`` అని ఏచూరి వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News