ఎమ్మెల్సీ తిరిగివ్వ‌లే.. మ‌రో ప‌ద‌వి వ‌స్తుందా...?

Update: 2021-11-29 16:30 GMT
ఎమ్మెల్సీ ప‌ద‌వి మ‌ళ్లీ వ‌స్తుంద‌ని గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ‌ను క‌రుణిస్తార‌ని.. త‌మ ప‌ద‌విని రెన్యువ‌ల్‌ చేస్తార‌ని భావించారు. కానీ జ‌రిగింది వేరు.. కొంత‌మంది ఎమ్మెల్సీల‌కు అధినేత మొండిచేయి చూపారు. తిరిగి అవ‌కాశం ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టారు. ఇదీ ఇటీవ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌వి రెన్యువ‌ల్ కాని నేత‌ల ప‌రిస్థితి. భ‌విష్య‌త్తులో మ‌రో ప‌ద‌వి కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూడ‌క త‌ప్ప‌డం లేదు.

దుర‌దృష్టం వెంటాడిందా..?

తెలంగాణ‌లో ఇటీవ‌ల 19 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేల కోటాలో ఆరు.. స్థానిక సంస్థ‌ల కోటాలో 12 స్థానాలు, గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్ప‌డింది. కొంద‌రి ప‌ద‌వీకాలం జ‌న‌వ‌రిలో ముగుస్తోంది. వీటి కోసం సిట్టింగ్ ఎమ్మెల్సీలు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. త‌మ‌కు మ‌ళ్లీ అవ‌కాశం వ‌స్తుంద‌ని ఎదురుచూశారు. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. ఇందులో కొంద‌రికే మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చారు పార్టీ అధినేత‌. ఇత‌ర ఈక్వేష‌న్స్‌ కార‌ణంగా వారిని దుర‌దృష్టం వెంటాడింది.

ఎమ్మెల్యే కోటాలో న‌లుగురికి మొండిచేయి..!

ఎమ్మెల్యే కోటాలో న‌లుగురికి కేసీఆర్ మొండిచేయి చూపారు. త‌మ ఆశ‌ల‌ను క‌ల్ల‌లు చేశారు. తిరిగి ప‌ద‌వి వ‌స్తుంద‌నే భావిస్తే అధినేత దూరం పెట్టారు. ప‌ద‌వీకాలం పూర్త‌యిన డిప్యూటీ చైర్మ‌న్ నేతి విద్యాసాగ‌ర్‌, బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, ఆకుల ల‌లిత‌, ఫ‌రీదుద్దీన్‌కు తిరిగి అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఆకుల ల‌లిత పేరు చివ‌ర వ‌ర‌కు ఉన్నా ఆఖ‌ర్లో చోటు ద‌క్క‌లేదు. పార్టీ అవ‌స‌రాలు, సామాజిక స‌మీక‌ర‌ణాలు.. ఇత‌ర నేత‌ల ఒత్తిడి కార‌ణంగా వీరిని రెన్యువ‌ల్ చేయ‌లేదట‌. భ‌విష్య‌త్తుపై హామీ మాత్రం ఇచ్చార‌ట‌. వీరి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు.

స్థానిక సంస్థ‌ల కోటాలో ఐదుగురికి నిరాశ‌..!

స్థానిక సంస్థ‌ల కోటాలో ఐదుగురికి నిరాశే ఎదుర‌యింది. పార్టీ అధినేత త‌మ ప‌ట్ల చ‌ల్ల‌ని చూపు చూస్తాడ‌నుకుంటే తిరిగి అవ‌కాశం ఇవ్వ‌కుండా శీత‌క‌న్ను చూపార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ కోటాలో ఖాళీ ఏర్ప‌డ్డ 12 స్థానాల్లో ఏడుగురు మాత్ర‌మే తిరిగి అవ‌కాశం ద‌క్కించుకున్నారు. మిగ‌తా ఐదు స్థానాల్లో కొత్త‌వారిని తీసుకున్నారు. న‌ల్ల‌గొండ నుంచి తేరా చిన్న‌ప‌రెడ్డి, ఖ‌మ్మం నుంచి బాల‌సాని ల‌క్ష్మీనారాయ‌ణ‌, మెద‌క్ నుంచి భూపాల్‌రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి నార‌దాసు ల‌క్ష్మ‌ణ‌రావుల‌కు, ఆదిలాబాద్ నుంచి పురాణం స‌తీశ్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారిని ఎంపిక చేశారు.

భ‌విష్య‌త్‌లో క‌రుణ చూపేనా..?

ఎమ్మెల్సీ స్థానాల‌కు దూర‌మైన ఈ తొమ్మిది మంది నేత‌ల భ‌విష్య‌త్ ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మున్ముందు ఇత‌ర అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని.. పార్టీ సేవ‌ల‌కు ఉప‌యోగించుకుంటామ‌ని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింద‌ట‌. అయినా వారి భ‌విష్య‌త్ రాజ‌కీయంపై బెంగ‌తో ఉన్నార‌ని అనుచ‌రులు చ‌ర్చించుకుంటున్నారు. చివ‌రికి కార్పొరేష‌న్‌, ఇత‌ర చైర్మ‌న్ల ప‌ద‌వి అయినా రాక‌పోతుందా అని వారు ఎదురుచూస్తున్నార‌ట‌. చూడాలి మ‌రి వారి భ‌విష్య‌త్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కు నెర‌వేరుతాయో..!




Tags:    

Similar News