రోడ్లే కొంప‌లు ముంచుతాయి ? జాగ్ర‌త్త జ‌గ‌న్ !

Update: 2022-03-17 14:30 GMT
పాల‌న‌ను అభివృద్ధి ప‌థంలో న‌డ‌పాల‌ని,విజ‌యాలు సాధించాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరిక.రెండు ద‌శ‌ల క‌రోనా త‌రువాత కూడా నిలదొక్కుకున్నా మ‌ళ్లీ మ‌రో ద‌శ రాక‌తో అంతా చింద‌ర‌వంద‌ర‌గా ఆర్థిక వ్య‌వ‌స్థ మారిపోయింది.దీంతో వైద్య రంగానికి కేటాయింపులు అన్న‌వి పెద్ద స‌మ‌స్య‌గా కూడా అయిపోయింది.

అయినా కూడా సీఎం త‌గ్గ‌లేదు.ఉన్నంత‌లో నిధులు స‌ర్ది, ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఆస్ప‌త్రుల్లో సిబ్బందితో ప‌నిచేయాల‌ని కొంద‌రు ఔత్సాహికుల‌ను కోరారు.ఇవ‌న్నీ బాగున్నా అప్పులు ఎలానూ చేస్తున్నారు క‌నుక రోడ్ల‌కు సంబంధించి ఎందుక‌ని చొర‌వ చూప‌లేక‌పోతున్నారు అన్న వాద‌న ఒక‌టి బ‌లీయంగా వినిపిస్తోంది.

అంటే తెచ్చిన అప్పులలో లెక్క‌కు చిక్క‌ని ఖ‌ర్చుకు కార‌ణం ఏంటి అన్న‌ది కూడా ఇప్పుడొక డైల‌మాగా మారింది. ఆ..లెక్క‌న చూసుకుంటే బ‌డ్జెట్ అనుమ‌తి లేకుండానే దాదాపు ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెట్టిన ప్ర‌భుత్వం అందులో ఓ రెండు వేల కోట్ల రూపాయ‌లు రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు ఎందుకు కేటాయించ‌లేక‌పోయింది అన్న వాద‌న కూడా ఇవాళ ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది.

ఈ ద‌శ‌లో సంక్రాంతి త‌రువాత రోడ్లు అని అన్నారు కానీ కాలేదు.పోనీ మార్చి త‌రువాత రోడ్లు వేస్తారా అంటే అనుమాన‌మే! కానీ వైసీపీ నాయ‌కులు మాత్రం అప్పులు చేసి అయినా  స‌రే! రెండు వేల కోట్ల రూపాయ‌ల‌తో రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు నిధులు కేటాయిస్తామ‌ని అంటున్నారు.

అంటే ఇప్ప‌టిదాకా రోడ్ల‌కు నిధులు అయితే లేవు అని తేలిపోయింది.గ్రామీణ ర‌హ‌దారుల‌కు అస్స‌లు ఫండ్స్ అన్న‌వి కేటాయింపులో లేనే లేవ‌ని కూడా తేలిపోయింది.కేటాయింపులు ఉన్నా నిధులు లేని కార‌ణంగా ఇప్ప‌టిదాకా రోడ్ల ప‌నులు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా మొద‌లుకాలేదు అని కూడా తేలిపోయింది.

కానీ సీఎం జ‌గ‌న్ మాత్రం నాడు నేడు కార్య‌క్ర‌మం మాదిరిగానే తాము రోడ్లను అభివృద్ధి చేసి ప్ర‌జ‌ల‌కు సంబంధిత స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యే విధంగా చేస్తామ‌ని ప‌దే ప‌దే అంటున్నారు.వైసీపీ నాయ‌కులు కూడా తమ అధినేత గొంతుక‌కు కోర‌స్ పాడుతున్నారు.కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో  ఉపాధి నిధులను కూడా వేరే మార్గంలో ఖ‌ర్చు చేసిన దాఖ‌లాలు (నిధుల మ‌ళ్లింపులో భాగంగా) ఉన్నాయి క‌నుక డ‌బ్బుల‌యితే ఖ‌జానాలో లేవు.

కానీ కేంద్రాన్ని ఒప్పించి కొన్ని దారుల్లో అప్పులు అయితే తేవ‌చ్చు.ఆ విధంగా కూడా తీసుకువ‌చ్చిన డ‌బ్బులు కూడా గ‌తంలోనే ఖ‌ర్చ‌యిపోయాయి అన్న ప్రాథ‌మిక స‌మాచారం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది ఏనాడో! అంటే బడుల‌కు కొత్త హంగులు ఇచ్చినంత త్వ‌ర‌గా..కొత్త రోడ్లు వేయ‌డం కాదు క‌దా పాత రోడ్లు బాగు చేయ‌డం కూడా కుద‌ర‌ని ప‌ని అని స్ప‌ష్టం అయిపోయింది.

ఓ వైపు మోడీ హ‌యాంలో  నేష‌నల్ హైవే  ( సిక్స్ లైన్స్ ప‌నులు) ప‌నులు చ‌క‌చ‌కా సాగిపోతున్నాయి.కొన్ని చోట్ల  అనిత‌ర సాధ్య రీతిలో ప‌నులు జ‌రిగి ఆయా ప్రాంతాల‌కు అభివృద్ధి వెలుగులు ద‌క్కాయి.అదేవిధంగా జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధిలో భాగంగా స్థానిక ప్ర‌తిపాద‌న‌లు (బైపాస్ ల నిర్మాణం, ఫ్లై ఓవ‌ర్ ల నిర్మాణం, ఆర్ ఓబీల నిర్మాణం) విని, సాధ్యాసాధ్యాల మేర‌కు మార్పులు సూచించి దాదాపు అన్నింటినీ ఒప్పుకుని ప‌నులు చేయించారు మోడీ.

దాంతో స్థానిక వివాదాలు కూడా త‌గ్గాయి.ఇదే స‌మ‌యంలో గ్రామీణ ర‌హ‌దారుల అభివృద్ధికి కూడా మోడీ ముందుకు వ‌చ్చి,రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌న్వ‌యంతో,కేంద్రం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల సంయుక్త భాగ‌స్వామ్యంతో అర‌వై,న‌ల‌భై నిష్ప‌త్తిలో ప‌నులు చేసేందుకు స‌మ్మ‌తి తెలిపారు.కానీ ఏపీ స‌ర్కారు మాత్రం త‌న వంతు మొత్తాన్ని జ‌మ చేసేందుకు పెద్ద‌గా ముందుకురాలేదు.దీంతో సంబంధిత ప్ర‌తిపాద‌న‌లు అట‌కెక్కాయి.

ఈ త‌రుణంలో కొత్త రోడ్లు మాట దేవుడెరుగు కానీ పాత రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌డితే అదే ప‌దివేలు అన్న తీరున ఇప్పుడున్న వాతావ‌ర‌ణం నెల‌కొంది.
Tags:    

Similar News