ఎట్ట‌కేల‌కు మ‌హా కేబినెట్ విస్త‌ర‌ణ‌.. ఎవ‌రెవ‌రికీ ఏయే శాఖ‌లు!

Update: 2022-08-11 08:55 GMT
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌లో క‌ల్లోలం సృష్టించి బీజేపీతో క‌ల‌సి ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టిన శివ‌సేన రెబ‌ల్ నేత ఏక‌నాథ్ షిండే ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. గ‌త 40 రోజుల‌ నుంచి మ‌హారాష్ట్ర‌లో మంత్రివ‌ర్గం అనేది లేని సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా ఏక‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫ‌డ్నవీస్ మాత్ర‌మే ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు, త‌దిత‌రాల విమ‌ర్శ‌ల‌తో ఎట్ట‌కేల‌కు ఏక‌నాథ్ షిండే త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించారు. మొత్తం 18 మందికి ప‌దవులు ద‌క్కాయి. దీంతో సీఎం, డిప్యూటీ సీఎంతో క‌లిపి మొత్తం మంత్రివ‌ర్గం 20కి చేరుకుంది. ఈ 20 మందిలో ఏక‌నాథ్ షిండే వ‌ర్గం వారు 10 మంది, బీజేపీ వారు 10 మంది ఉన్నారు.

వాస్త‌వానికి మ‌హారాష్ట్ర‌లో మొత్తం 43 మందిని మంత్రులుగా తీసుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ మొద‌టి విడ‌తలో 18 మందికి మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు. అయితే ఒక్క మహిళ‌కూ మంత్రిగా అవ‌కాశ‌మివ్వ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. అలాగే టిక్ టాక్ స్టార్ పూజా చ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే సంజ‌య్ రాథోడ్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై బీజేపీ నేత‌లే విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది.

రెండు రోజుల క్రిత‌మే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసిన‌ప్ప‌టికీ ఇంకా ఎవ‌రికీ శాఖ‌లు కేటాయించ‌లేదు. శాఖ‌ల కేటాయింపుపై శివ‌సేన రెబ‌ల్ వ‌ర్గం, బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. కాగా గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి.. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఏక‌నాథ్ షిండేకు వ‌దులుకున్న దేవేంద్ర ఫ‌డ్నవీస్ కు హోం శాఖ ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చంద్ర‌కాంత్ పాటిల్ ను కూడా మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు కూడా కీల‌క శాఖ‌లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

కాగా, శివ‌సేన రెబ‌ల్, బీజేపీలో మొత్తం 14 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. అయితే ఒక్క‌రికీ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ఆ రెండు పార్టీలు ఎలా స‌మ‌ర్థించుకుంటాయో వేచిచూడాలంటున్నారు. హోం శాఖ దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కు కేటాయిస్తున్న నేప‌థ్యంలో మిగతా మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే దానిపై తుది జాబితా అధికారికంగా ప్రకటించలేదు.

కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏ మంత్రికి, ఏ శాఖ లభించే అవకాశాలున్నాయో ఓ జాబితా మాత్రం సోష‌ల్ మీడియాలో, మీడియా సర్కిళ్ల‌లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. దాని ప్ర‌కారం.. బీజేపీ ఎమ్మెల్యేలు సుధీర్ మున‌గంటివార్ కు విద్యుత్, అట‌వీ శాఖ‌లు, అతుల్ సావేకు ఆరోగ్య శాఖ‌, గిరీష్ మ‌హాజ‌న్‌కు జ‌ల‌వ‌న‌రుల శాఖ‌, సురేష్ ఖాడేకు సామాజిక సంక్షేమం, ర‌వీంద్ర చ‌వాన్ కు గృహ‌నిర్మాణ శాఖ‌, మంగ‌ళ్ ప్ర‌భాత్ లోధాకు సామాజిక న్యాయ‌శాఖ‌, విజ‌య్ కుమార్ గావిత్ కు ఎస్టీ, ఎస్సీ సంక్షేమం, రాధాకృష్ణ‌పాటిల్ రెవెన్యూ స‌హ‌కార శాఖ‌లు ద‌క్కుతాయ‌ని అంటున్నారు.

ఇక ఏక‌నాథ్ షిండే వ‌ర్గంలోని మంత్రుల్లో గులాబ్ రావు పాటిల్ కు నీటిపారుద‌ల‌, దాదా భుసేకు వ్య‌వ‌సాయ శాఖ‌, సంజ‌య్ రాథోడ్ కు గ్రామాభివృద్ధి శాఖ‌, సందీప‌న్ భుమ‌రేకు ఉపాధి హామీ శాఖ‌, ఉద‌య్ సామంత్ కు ప‌రిశ్ర‌మ‌లు, తానాజీ సావంత్ కు ఉన్న‌త‌, సాంకేతిక విద్యా శాఖ‌లు, అబ్దుల్ స‌త్తార్ కు మైనార్టీ సంక్షేమ శాఖ‌, దీప‌క్ కే స‌ర్కార్ కు ప‌ర్యావ‌ర‌ణ‌, ప‌ర్యాట‌క శాఖ‌, శంభూరాజ్ దేశాయ్ కు ఆదాయ ప‌న్ను శాఖ‌లు ల‌భిస్తాయ‌ని టాక్ న‌డుస్తోంది.
Tags:    

Similar News