శివాజీ రీ ఎంట్రీ!... ఏపీలో బీజేపీ ఉండ‌రాద‌ట‌!

Update: 2018-01-29 10:23 GMT
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీని త‌క్ష‌ణం ఆదుకునేందుకు కేంద్రం... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్ర‌క‌టించాల్సిందేన‌ని రోజుల త‌ర‌బ‌డి ఉద్య‌మం చేసిన సినీ న‌టుడు శివాజీ మ‌ళ్లీ రంగంలోకి దిగేసిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. ఓ రెండేళ్ల క్రితం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌ని - అప్ప‌టిదాకా తాను విశ్ర‌మించేది లేద‌ని తేల్చి పారేసిన శివాజీ వివిధ రూపాల్లో ఉద్య‌మాన్ని కొన‌సాగించారు. అయితే శివాజీ ఉద్య‌మానికి ఏపీ ప్ర‌జ‌ల నుంచి పెద్దగా మ‌ద్ద‌తు ల‌భించ‌కున్నా... అందివ‌చ్చిన త‌క్కువ మందితోనే శివాజీ ఉద్య‌మం కొనసాగించారు. విజ‌య‌వాడ‌లో ఏకంగా టెంటు వేసుకుని నిరాహార దీక్ష‌కు దిగిన శివాజీని పోలీసులు బ‌లవంతంగా అక్క‌డి నుంచి లేపేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయిన శివాజీ... ఉన్న‌ట్లుండి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది మాత్ర‌మే స‌మ‌య‌మున్న నేప‌థ్యంలో రంగంలోకి దిగిపోయారు. వ‌చ్చీ రాగానే త‌న‌దైన స్వ‌రాన్ని వినిపించిన శివాజీ... ఏపీ నుంచి బీజేపీని పార‌దోలాల్సిందేన‌ని పిలుపునిచ్చారు. అస‌లు ఏపీలో బీజేపీ అన్న మాటే వినిపించ‌రాదంటూ ఆయ‌న త‌న‌దైన శైలిలో ఫైరైపోయారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌య‌ముంద‌న‌గా... ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాలు వేడెక్కాయ‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుదీర్ఘ పాద‌యాత్ర‌ను చేప‌ట్టారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా విడ‌త‌ల‌వారీ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. జ‌గ‌న్ యాత్ర ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతుంటే... ప‌వ‌న్ యాత్ర నేటితో అనంత‌పురం జిల్లాలో ముగియ‌నుంది. ఈ రెండు యాత్ర‌ల‌తో ఏపీ రాజ‌కీయాలు ఇప్ప‌టికే వేడెక్కాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి కీల‌క త‌రుణంలో ఎంట్రీ ఇచ్చిన శివాజీ నేటి ఉద‌యం మీడియా ముందు త‌న గ‌ళాన్ని వినిపించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన బీజేపీ... ఇప్ప‌టిదాకా ఆ దిశ‌గా అడుగులు వేయ‌క‌పోగా... తాను ఇచ్చిన హామీని మ‌రిచి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌రదంటూ కొత్త రాగం అందుకుంద‌న్నారు. నీతి ఆయోగ్ పేరు చెప్పి బీజేపీ స‌ర్కారు ఏపీ ప్ర‌జ‌ల‌ను వంచ‌నకు గురి చేస్తోంద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏపీలో బీజేపీ అన్న మాటే వినిపించ‌రాద‌ని కూడా ఆయ‌న ఏపీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఇక బీజేపీపై చాలా ఘాటుగా విరుచుప‌డిన శివాజీ ఎలాంటి ఆరోప‌ణ‌లు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే.. ఏపీ రాష్ట్రంలో బీజేపీ అనే పదం విన్పించకూడదని శివాజీ వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని బీజేపీ తుంగలో తొక్కిందని విమర్శించారు. దీని ఆధారంగానే ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ... త‌న మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీతో తెగతెంపులు చేసుకొని ప్రధానమంత్రిపై పోరాటం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని బీజేపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీని విస్మరించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను ఇప్ప‌టికైనా నెరవేర్చాలని ఆయ‌న‌ బీజేపీ నేతలను కోరారు. ఏపీ ప్రజలు ఏం అన్యాయం చేశారని శివాజీ బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రత్కేక హోదాను ఇస్తే ఏపీ ప్రజలు బీజేపీ వెంట నిలుస్తారని ఆయ‌న చెప్పారు. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్న విషయాన్ని శివాజీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా ఏపీకి చెందిన‌ ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయాలని సూచించారు.

Tags:    

Similar News