'పౌరసత్వ' ఆందోళనల్లో యూపీలో ఆరుగురు చనిపోయారా?

Update: 2019-12-21 05:10 GMT
ఏదేదో జరిగిపోతుందని అందరూ భావించిన అంశాల్ని తనదైన శైలిలో డీల్ చేసి నిరసనలు.. ఆందోళనలు అన్నవి లేకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు మోడీ. అందుకు భిన్నమైన పరిస్థితులు ఇటీవల పార్లమెంటులో చట్టంగా పాస్ అయిన పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మాత్రం చోటు చేసుకున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై తొలుత ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు షురూ కాగా.. వాటిని కంట్రోల్ చేసే లోపు.. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ.. తర్వాత పలు రాష్ట్రాల్లో వ్యాపించటం గమనార్హం.

పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబికిన ఆందోళనలు తొలుత బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలో స్టార్ట్ అయినప్పటికీ తర్వాత బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఊపందుకున్నాయి. అనూహ్యంగా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంతకంతకూ పెరగటమే కాదు.. చేయి దాటిపోయినట్లుగా పరిస్థితులు చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. గురువారం నాడు జరిగిన ఆందోళనల్లో బీజేపీ పవర్ లో ఉన్న కర్ణాటకలో మరణాలు చోటు చేసుకుంటే.. శుక్రవారం బీజేపీ ప్రభుత్వమున్న యూపీలో ఏకంగా ఆరుగురు మరణించటం సంచలనంగా మారింది.

మరణించిన ఆరుగురు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు.. నిరసనల్లోనే మరణించారా? వారి మరణానికి మరే ఇతర కారణమైనా ఉందా? అన్న విషయాన్ని పోలీసులు స్పష్టం చేయటంలేదు. పోస్ట్ మార్టం రిపోర్టుల ఆధారంగానే తాము వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.  యూపీ వ్యాప్తంగా పౌరసత్వ ఆందోళనలు మరింత ముదిరాయి. వివిద ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తుంటే.. అదేం కాదు చాలా ప్రాంతాల్లో పోలీసులపైనే ఆందోళనకారులు కాల్పులు జరిపినట్లుగా సంచలన వాదనలు తెర మీదకు వస్తున్నాయి.

ఈ తరహా కాల్పుల్లో 50మంది పోలీసులు తీవ్ర గాయాలైనట్లుగా చెబుతున్నారు. యూపీలో నిరసనల హోరు మరింత పెరగటంతో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. పలు నగరాల్లో 45 గంటల పాటు నెట్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించారు.

యూపీలో పరిస్థితి ఇలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనల అగ్గి అంతకంతకూ రాజుకుంటోంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వేలాదిమంది చారిత్రక జామా మసీదు వద్దకు చేరుకొన్నారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించినా.. అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున  జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు.

పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారటంతో ఢిల్లీ పాతబస్తీలోని 17 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటివద్ద కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఢిల్లీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కమ్ రాష్ట్రపతి ప్రణబ్ దా కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల తీవ్రత పెరుగుతున్న పశ్చిమబెంగాల్ లోనూ ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. కేరళ.. కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ ఆందోళనలు నిర్వహించారు.
Tags:    

Similar News