ప్రచారంలో కమల్ హాసన్ కు చేదు అనుభవం

Update: 2019-05-16 05:50 GMT
రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు  కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల మంటలు చల్లారడం లేదు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువు అని.. అతడి పేరు నాథూరాం గాడ్సే అంటూ  ప్రచారంలో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  దీంతో కమల్ ఎక్కడికి వెళ్లినా హిందుత్వ వాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

హిందూ ఉగ్రవాదంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన కమల్ హాసన్ కు అవమానం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విల్లాపురంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయనపై ఓ దుండగుడు చెప్పు విసిరాడు. అయితే అది కమల్ కు తగులకపోవడం గమనార్హం.

అయితే మరికొంత మంది ఆకతాయిలు కూడా కమల్ పై చెప్పులు విసరాడానికి రెడీ కాగా పోలీసులు అప్రమత్తమై ఆ  ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా కమల్ పై చెప్పు విసిరిన వ్యక్తితోపాటు ప్రయత్నించిన మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి ప్రయత్నించింది బీజేపీ కార్యకర్తలు, హనుమాన్ సేన సభ్యులు అని పోలీసులు గుర్తించారు. హిందువే తొలి ఉగ్రవాది అని కమల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడికి ప్రయత్నించినట్టు పోలీసుల విచారణలో వారు తెలిపారు.

కాగా తమిళనాట కమల్ వ్యాఖ్యల కలకలం కొనసాగుతోంది. తమిళనాడు లోని కరూర్ జిల్లాకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కమల్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. హిందువులను టెర్రరిస్టులంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను కించపరిచాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    

Tags:    

Similar News