ఏపీ రాజధానిలో ఈగలు తోలుతున్న వ్యాపారులు

Update: 2016-11-16 09:29 GMT
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఏపీ రాజధాని అమరావతి - ఆ పరిసర నగరాలు - గ్రామాలు - పట్టణాల్లో వ్యాపారులను కుదేలు చేస్తోంది. ఎక్కడా వ్యాపారమన్నది సాగడం లేదు. అన్ని రకాల వ్యాపారాలకు పెట్టింది పేరైన విజయవాడ నగరంలో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా హోటళ్లయితే ఈగలు తోలుతున్నాయి. చిల్లర‌కు విప‌రీత‌మైన కొరత ఏర్పడడంతో కస్టమర్లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయారు. దీంతో హోట‌ల్ వ్యాపారులు కస్టమ‌ర్లు రాక‌ కొంత.. వచ్చినవారికి చిల్లర ఇవ్వలేక మరికొంత అష్టకష్టాలు పడుతున్నారు.

స్వైపింగ్ మిష‌న్లు అందుబాటులో ఉన్న వ్యాపారులకు కొంత ఇబ్బంది తప్పుతోంది. హైదరాబాద్ తో పోల్చితే బెజవాడలో కార్డుల వినియోగం తక్కువే. కానీ... తాజా పరిణామాల నేపథ్యంలో కొంతవరకు వినియోగం పెరిగింది. కార్డు ద్వారా చెల్లింపులు తీసుకునే సౌక‌ర్యం లేనివారు మాత్రం రోజంతా వ్యాపారం లేక దిక్కులు చూస్తున్నారు.

ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే దుకాణదారులు తాము తీసుకున్న బ్యాంకు రుణాలకు ఈఎంలు కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది. దుకాణాల అద్దెల చెల్లింపులు.. వర్కర్లకు వేతనాలు.. ఒకటేమిటి అన్ని కష్టాలు మొదలవుతాయి. వ్యాపారాలు జరగకపోతే వ్యాపారులతో పాటు వారి వద్ద పనిచేసే వారి కుటుంబాలూ ఇబ్బందుల్లో చిక్కుకుంటాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News