మెట్రో ఎక్కిన పెళ్లి కుమార్తె.. బెంగళూరు బ్రాండ్ కు దెబ్బే

Update: 2023-01-20 09:30 GMT
గార్డెన్ సిటీ అన్నంతనే బెంగళూరు గుర్తుకు వస్తుంది. అలాంటి మహానగరం ఐటీ పుణ్యమా అని మరో లెవల్ కు వెళ్లిపోవటమే కాదు.. ప్రపంచ పఠంలో దానికున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అలాంటి బెంగళూరు మహా నగరానికి గడిచిన కొంత కాలంగా ట్రాఫిక్ పెను శాపంగా మారింది. దీనికి తోడు హైదరాబాద్ మాదిరి ఔటర్ రింగ్ రోడ్ లేకపోవటం మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు మామూలే అయినా.. వాటిని అధిగమించేందుకు హైదరాబాద్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో పోల్చినప్పుడు బెంగళూరు వెనుక పడిందనే చెప్పాలి.

ఇది కూడా బెంగళూరు కాస్తంత వెనుకబడటానికి.. హైదరాబాద్ దూసుకెళ్లటానికి కారణంగా చెప్పక తప్పదు. తాజాగా ఒక వైరల్ వీడియో గార్డెన్ సిటీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా మారిందంటున్నారు. దీనికి కారణం ఒక పెళ్లి కుమార్తె కావటం విశేషం.

పెళ్లి కుమార్తె ఏంటి? బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ దెబ్బేయటం ఏమిటి? అన్న సందేహంలో ఉన్నారా? ఈ ఉదంతం గురించి తెలిస్తే.. విషయం మీకే అర్థమవుతుంది. పెళ్లి మండపానికి బయలుదేరిన పెళ్లి కుమార్తె ఒకరు బెంగళూరు ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నారు. ట్రాఫిక్ అధికంగా ఉండటంతో.. తాను చేరాల్సిన సమయానికి పెళ్లి మండపానికి చేరే అవకాశం తక్కువగా ఉండటంతో.. పెళ్లి కుమార్తెమెట్రో ఎక్కేశారు.

పెళ్లి కుమార్తె గా పూర్తిగా రెఢీ అయి.. మెట్రోలో ఎక్కిన ఆమెను చూసిన ఒక ఔత్సాహికుడు ఆమెకు సంబంధించిన వీడియోను తీసి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ''వాటే ఏ బ్రైడ్'' పేరుతో తీసిన ఈ వీడియోను అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది దీన్ని చూడటం గమనార్హం.

బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ సమస్య ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తాజా వీడియో చెప్పినట్లు అయ్యిందంటున్నారు. ఇలాంటి వీడియోలతో బెంగళూరు మహానగర ఇమేజ్ కు దెబ్బగా మారటమే కాదు.. బెంగళూరును క్రాస్ చేయాలని తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఇలాంటివి చక్కటి ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News