ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ కేరాప్ ఏపీ

Update: 2016-02-14 10:38 GMT
 మొబైల్ ఫోన్లు - వాటి విడిభాగాల తయారీకి తెలుగు రాష్ట్రాలు ప్రధాన కేంద్రం కానున్నాయి.  ఇంకా చెప్పాలంటే ఇండియాలో తయారయ్యే ఫొన్లు - విడిభాగాల్లో సగం తెలుగు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి కానున్నాయి.  2020 నాటికి భారత మొబైల్ ఫోన్లు - విడిభాగాల తయారీలో ఏపీ - తెలంగాణల వాటాయే 40 నుంచి 50 శాతం ఉంటుందని అంచనా.

ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ లో మైక్రోమ్యాక్స్ - సెల్ కాన్ ప్లాంట్లు పని చేస్తున్నాయి. ఏపీలోనూ శ్రీ సిటీలో ఫాక్స్ కాన్ ఉత్పత్తి మొదలు పెట్టేసింది. విశాఖ పట్టణంలోనూ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి మొదలైంది. తెలుగు రాష్ట్రాలు పారిశ్రామిక అభివృద్ధికి పోటాపోటీగా సాగుతుండడంతో మరిన్ని సంస్థలు యూనిట్లు ఏర్పాటుచేయనున్నాయి. దాంతో వచ్చే అయిదేళ్లలో భారీగా ఉత్పత్తి పెరుగుతుందని అంచనావేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో 200 కోట్ల మొబైల్ హ్యాండ్ సెట్లు తయారవుతుండగా అందులో పది కోట్ల హ్యాండ్ సెట్లు ఇండియాలో తయారవుతున్నాయి. 140 కోట్ల ఫొన్లు చైనాలో తయారవుతున్నాయి.అయితే... ఇండియాలో 2019-20 నాటికి మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 50 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలు 25 కోట్ల ఫోన్ల ఉత్పత్తికి కేంద్రమవుతాయని ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఫాస్ట్ ట్రాక్ టాస్క్ ఫోర్స్ విభాగం అంచనావేస్తోంది. నోకియా, శ్యాంసంగ్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఏపీలో తమ తయారీ యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వాలను సంప్రదిస్తున్నాయి. కాగా ఈ రంగంలో ఉద్యోగవకాశాలూ అంతే స్థాయిలో పెరగనున్నాయి. ముఖ్యంగా మొబైళ్ల తయారీలో నిపుణులైన శిక్షకుల కోసం ఇప్పటికే ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్, తైవాన్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండస్ర్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సుమారు 10 వేల మందికి ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్ లో నైపుణ్య శిక్షణలు ఇవ్వనున్నారు.
Tags:    

Similar News