స్మృతికి సీఎం ప‌ద‌వి?

Update: 2016-02-23 04:55 GMT
ఎంపీగా గెల‌వ‌కున్నా.. ఏకంగా కేంద్ర‌మంత్రి అయ్యారు. అది మొద‌టి ప్ర‌య‌త్నంలోనే. ఇంకా చెప్పాలంటే త‌ల‌పండిన సీనియ‌ర్ల‌కు ఇచ్చే మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌ను చేప‌ట్ట‌ట‌మే కాదు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బండి న‌డిపిస్తూ.. స‌మ‌ర్థ‌మైన నాయ‌కురాలిగా ఎదుగుతున్న ఆమె ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది. అవును.. ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పిందంతా కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ గురించే.

పోరాడి గెలిచే మ‌న‌స్త‌త్వం ఉన్న స్మృతి ఇరానీ టీవీ న‌టిగా సుప‌రిచితురాలు. క‌ష్టాన్ని ఇష్టంగా చేసుకొని శ్ర‌మించేత‌త్వం ఉన్న స్మృతికి ధైర్యం పాళ్లు ఎక్కువే. గాంధీ ఫ్యామిలీ మీద ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సై అన‌ట‌మే కాదు.. కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీకి ముచ్చ‌మ‌ట‌లు పోసేలా చేసిన స‌త్తా ఆమె సొంతం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అమేధీ బ‌రిలో దిగి ఓడినా.. ఆమె పోరాట ప‌టిమ‌.. రాహుల్ ను పెట్టిన ఇబ్బంది ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించేలా చేసింది. ఇదే.. ఆమెకు కేంద్రమంత్రి మండ‌లిలో అతి పెద్ద శాఖ‌ను డీల్ చేసే అవ‌కాశం ద‌క్కింది.

తాజాగా ఆమెకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అంశం తెర మీద‌కు వ‌చ్చింది. మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమెను బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించుతార‌న్న‌మాట బ‌లంగా వినిపిస్తోంది. అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌టం.. త‌న ప్ర‌సంగాల‌తో సామాన్యుల్ని విప‌రీతంగా ఆక‌ర్షించేస‌త్తా ఉన్న ఆమె.. యూపీ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితురాలే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అమేధీ నుంచి పోటీ చేసి ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ.. కేంద్ర‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా అమేధీకి వెళ్ల‌టం.. అక్క‌డి వారితో ట‌చ్ లో ఉండ‌టం లాంటివి ఆమెకు ప్ల‌స్‌గా మారాయి. బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఆమెను ప్ర‌క‌టిస్తే.. యూపీలో సానుకూల ప‌రిస్థితుల‌కు అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అన్ని అనుకున్న‌ట్లే జ‌రిగితే.. స్మృతిని దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా చూసే అవ‌కాశం ఉంద‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News