రాహుల్ గాంధీ పై స్మృతి ఇరానీ ఫైర్‌!

Update: 2017-07-22 12:56 GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మ‌ధ్య ట్వ‌ట్ట‌ర్ లో వార్ జ‌రుగుతోంది. మోదీ ప్ర‌భుత్వాన్ని హిట్ల‌ర్ పాల‌న‌తో పోల్చిన రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ ఘాటుగా బ‌దులిచ్చారు. త‌న‌దైన శైలిలో చ‌మ‌త్కారంగా  కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.  భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ పార్టీకి నిస్తేజ‌మైన భ‌విష్య‌త్తు ఉంద‌ని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

శుక్రవారం బెంగళూరులో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఎన్డీయే ప్రభుత్వంపై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. మోదీ పాల‌న‌ను హిట్లర్ పాలనతో పోల్చారు. మోదీ ప్రభుత్వం వాస్తవాల గొంతును నులిమేస్తోందని రాహుల్ ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వం పేదలను అణగదొక్కుతోంద‌ర‌ని అన్నారు. కేంద్రం భారతదేశానికి అబద్ధాల రంగును పులిమేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై స్మృతి ఇరానీ ట్విట్ట‌ర్ లో స్పందించారు.
 
దేశంలో 21 నెలలపాటు అత్యవసర పరిస్థితి కొన‌సాగింద‌ని రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ గుర్తు చేశారు. ఇందిరాగాంధీ హ‌యాంలో ఎమర్జెన్సీ సమయంలో పత్రికలపై సెన్సార్‌షిప్ విధించారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని జైలుపాలు చేశారని పేర్కొన్నారు. ఆ ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకుంటే ఎవ‌రి పాల‌న ఎటువంటిదో తెలుస్తుంద‌న్నారు.

ఎమ‌ర్జెన్సీ పై రాహుల్ లేటుగా స్పందించార‌ని స్మృతి ఇరానీ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘మీరు దీని గురించి 42 ఏళ్ళు ఆలస్యంగా స్పందిస్తున్నారు. హిట్లర్‌ నుంచి ఎవరు ప్రేరణ పొందారో, ఎమర్జెన్సీని విధించారో, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారో ఊహించడం కష్టమేమీ కాదు’’ అని  స్మృతి ఇరానీ  ఘాటుగా ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ‘‘కాంగ్రెస్‌కు నిస్తేజమైన భవిష్యత్తు ఉంది, కానీ మన దేశానికి కాదు’’ అని అన్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ చేస్తున్న పనికి ధన్యవాదాలు...అని స్మృతి అన్నారు.

Tags:    

Similar News