జవదేకర్ ఆఫీసుకు వచ్చిన వేళ.. స్మృతి డుమ్మా

Update: 2016-07-07 08:28 GMT
మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా ప్రకాశ్ జవదేకర్ కు ప్రమోషన్ ఇస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అంతేకాదు.. అతి కీలకమైన మానవవనరుల శాఖను స్మృతి ఇరానీ నుంచి ప్రకాశ్ జవదేకర్ కు ఇస్తూ.. ఆయనకు గురుతర బాధ్యతను అప్పగించారు. ఇటీవల కాలంలో స్మృతి ఇరానీ వైఖరిపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన వేళ.. ఆమెను డిమోట్ చేస్తూ.. జౌళిశాఖకు పరిమితం చేస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మానవవనరుల శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రకాశ్ జవదేకర్ ఆఫీసుకు వెళ్లారు.

ఈ కార్యక్రమానికి ఇప్పటివరకూ ఆ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్మృతి ఇరానీ హాజరవుతారని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా ఆమె బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టటం గమనార్హం. మంత్రివర్గ విస్తరణలో మరెవరికీ లేని విధంగా ఒక్క ప్రకాశ్ జవదేకర్ కు మాత్రమే ప్రమోషన్ ఇవ్వగా.. పలువురు మంత్రుల వద్ద ఉన్న పలుశాఖల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

హెచ్ ఆర్డీ మినిష్టర్ గా ప్రకాశ్ జవదేకర్ బాధ్యతలు చేపట్టే సమయంలో.. ఇప్పటివరకూ ఈ శాఖ బాధ్యతల్ని నిర్వహించిన స్మృతి ఇరానీ హాజరు కాకపోవటం చర్చగా మారింది. ఈ అంశంపై జవదేకర్ మాట్లాడుతూ.. ఆమె కుటుంబంలోని కారణాల వల్లే కార్యక్రమానికి హాజరు కాలేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. పదవులు ఉండటం పోవటం సహజం. అంతమాత్రానికే ఫీలై.. హుందాతనాన్ని వదిలేయటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటి విమర్శలపై స్మృతి ఇరానీ మరెంత ఫైర్ అయిపోతారో..?
Tags:    

Similar News