బీజేపీలో ఇదేం రాజ‌కీయం?!

Update: 2015-09-27 05:46 GMT
బీజేపీలో కూడా సాంప్ర‌దాయ‌ రాజ‌కీయాల‌కు పెద్ద‌పీట వేస్తోందా? ఇన్నాళ్లుగా పార్టీలో జ‌రిగే ప‌రిణామాలు బ‌య‌టికి పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డిన ఆ పార్టీ ఇపుడు అలా చేయ‌లేకపోతోందా?  తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం కావ‌డం వ‌ల్ల ఆ పార్టీ వెన‌క్కుత‌గ్గాల్సి వ‌స్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీలోని జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పదవి కట్టబెడతారనే ఊహాగానాలు వెలువ‌డ్డాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ మేర‌కు సిఫార‌సు చేసింద‌ని...అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌డ‌ట‌మే ఆల‌స్యం అనే చ‌ర్చ సాగింది. అయితే ఈ చ‌ర్చ‌ల‌కు ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెరదించారు. వయసు రిత్యా వీసీ పదవికి సుబ్రహ్మణ్య స్వామి అనర్హులని తేల్చి చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామికి వీసీ ప‌ద‌వి ఇవ్వాలంటూ తన శాఖ ఎలాంటి సిఫార్సు చేయలేదని స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. సెర్చ్ అండ్ సెలెక్ట్ కమిటీనే ఆయన పేరును ప్రతిపాదించినట్లు ఆమె వివరించారు. వీసీ పదవి చేపట్టేందుకు ఓ వయసు నిబంధన ఉంటుందన్న స్మృతీ ఇరానీ, సుబ్రహ్మణ్యస్వామి దాన్ని దాటిపోయారన్నారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని ముగించారు.

జేఎన్‌యూ ప్రస్తుత వైస్ ఛాన్సలర్ వచ్చే జనవరికి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ పోస్టును సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్త‌లు వెలువ‌డ్డాయి. మరోవైపు  విద్యావ్యవస్థలను బీజేపీ కాషాయమయం చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో స్మృతీ ఇరానీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామికి క‌ర‌డుగ‌ట్టిన హిందుత్వ వాదిగా పేరుండ‌టం కూడా ఒక కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అయితే బీజేపీలో ఈ విధంగా ఒక కీల‌క స్థాయి వ్య‌క్తిపై అంచ‌నా వెలువ‌డటం, అది అర్ధాంత‌రంగా వెన‌క్కుపోవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామ‌మే.
Tags:    

Similar News