చౌకీదార్ చోర్.. చిక్కుల్లో పడ్డ ప్రియాంక

Update: 2019-05-03 08:03 GMT
రాఫెల్ కుంభకోణాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ అనే నినాదాన్ని ఇచ్చాడు. దీన్నే అస్త్రంగా మలిచి మోడీ తన పేరు ముందర ట్విట్టర్ లో ‘చౌకీదార్ నరేంద్రమోడీ’ అని పెట్టేసుకున్నాడు. ఇటీవల సుప్రీం కోర్టు కూడా చౌకీదార్ మాటలు అన్నందుకు రాహుల్ కు వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదాలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ‘చౌకీదార్’ వివాదంలో చిక్కుకున్నారు.

అమేథీలో ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ కనిపించిన చిన్నారులను పలకరించారు. వారంతా ‘చౌకీదార్ చోర్ హై’ అని గట్టిగా నినాదాలు చేశారు . వారివద్దకు వెళ్లిన ప్రియాంక ... అది వివాదంగా మారిన నేపథ్యంలో అలా అనవద్దని విద్యార్థులను వారించారు. మంచి మాటలు మాట్లాడాలని.. ఇలాంటి విషయాలు అనవద్దని హితవు పలికారు.

అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి సృతీ ఈరానీ మండిపడ్డారు. ఘాటుగా ట్వీట్ చేశారు. పిల్లలకు ఇలాంటి భాషను కాంగ్రెస్ నేర్పిస్తోందంటూ ధ్వజమెత్తారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను జాతీయ బాలలహక్కుల సంఘం సుమోటాగా తీసుకుంది. ప్రియాంక గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  ఈ ఘటనపై ప్రియాంకపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కూడా కోరింది. దీంతో తన ప్రమేయం లేకున్నా కానీ ప్రియాంక గాంధీ చౌకీదార్ చోర్ వివాదంలో చిక్కుకున్నారు.
    

Tags:    

Similar News