దేశ్‌ కీ నేత‌ల‌తో కేసీఆర్‌ కు షాకివ్వ‌నున్న బీజేపీ

Update: 2018-09-22 10:59 GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికల రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. అధికార‌మే ల‌క్ష్యంగా ఆయా పార్టీల నేత‌లు ఎత్తులు వేస్తున్నారు. ఈ ప‌రిణామంలో సోలోగా బ‌రిలో దిగాల‌ని నిర్ణ‌యం తీసుకున్న బీజేపీ ఇందుకు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌చారంలో భాగంగా ప్లాన్ బీని అమ‌ల్లో పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌ రామ్‌ గంగారామ్‌ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్న విషయం విదితమే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత‌లు దేశ్ కీ నేత‌ల‌తో ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ప‌లువురు కీల‌క నాయ‌కుల‌తో ప్ర‌చారం హోరెత్తించాల‌ని భావిస్తునన్నారు.

బీజేపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీతోపాటు పలువురు బీజేపీ జాతీయ నాయకులు - కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 27న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్‌ కు రానున్నారు. మహిళా మోర్చా నాయకులతో ఆమె భేటీ కానున్నట్టు సమాచారం. ఈ సందర్బంగా పలువురు మహిళా నేతలను బీజేపీలో చేర్చుకోనున్నారు. ఈనెల 29న ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కరీంనగర్‌ లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించబోయే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. వీరితోపాటు మరికొంత మంది బీజేపీ నేతలు రాష్ట్రానికి రానున్నారని సమాచారం.  ఇప్పటికిప్పుడు సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతాన్ని పెంచుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతున్నది. ఈ క్రమంలోనే మారుమూల పట్టణాలు - ప్రాంతాలను ఎంపిక చేసుకుని బీజేపీ నేతలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

దీంతోపాటుగా ప్రాంతీయ ఎజెండాల‌కు పెద్ద‌పీట వేసి బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. స్థానిక ప్రజల భాష - యాస - సంస్కతి - సాంప్రదాయాలు - కులం - మతం గురించి ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తారు. తద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్నది బీజేపీ వ్యూహంగా కనబడుతున్నది. మరోవైపు తెలంగాణలో యువజన సమ్మేళనం నిర్వహించేందుకు బీజేపీ యోచిస్తున్నది. ఈ కార్యక్రమానికి కూడా మోడీని ఆహ్వానించేందుకు ఆ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. స్థూలంగా దేశ్‌ కీ నేత‌ల‌తో క‌లిసి ప్ర‌చారాన్ని హోరెత్తించాల‌ని భావిస్తున్న‌ట్లు క‌మ‌ళ‌నాథులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News