మరో వీరప్పన్.. దొరికాడిలా..

Update: 2021-01-10 04:45 GMT
తమిళనాడు బడా స్మగ్లర్, ఎర్రచందనం దుంగల అక్రమదారు  అయిన భాస్కరన్ పోలీసుల చేతికి చిక్కాడు. కొంతకాలంగా ఇతడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. తమిళనాడులో మకాం వేసిన ఇతడిని పోలీసులు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు కడప జిల్లా పోలీసులు ధ్రువీకరించారు.

గతంలో కర్ణాటక, తమిళనాడులను అల్లాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ లాగానే భాస్కరన్ కూడా తయారయ్యాడు. తన అనుచరుల చేత శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికించి తమిళనాడు, కర్ణాటక మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటాడు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గా మారాడు. 2016 నుంచి ఇతడిపై 21 కేసులు నమోదయ్యాయి.

భాస్కరన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరో 16మందిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కోటి విలువైన ఎర్రచందనం దుంగలు.. 290 గ్రాముల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భాస్కరన్ ఇంత పెద్ద అక్రమ వ్యాపారం వెనుక రాజకీయ పెద్దలు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇతడి వెనుకాల తమిళనాడుకు చెందిన బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు వార్తలువస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. త్వరలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.
Tags:    

Similar News