ఇది.. `సోష‌ల్ మీడియా పంచాంగం` నేత‌లూ వినండ‌హో!

Update: 2023-03-22 22:41 GMT
తాజాగా శోభ‌కృత్ నామ ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాజ‌కీయ నేత‌లు, ప్ర‌భుత్వాలు పంచాంగ ప‌ఠనాన్ని నిర్వ‌హిం చుకుని.. ఎవ‌రికివారు ఆహా.. ఓహో.. అనేలా పండితుల‌తో చెప్పించుకున్నారు. ఏపీలో మాత్రం.. ప్ర‌తి ఏడాది జ‌రిగే పంచాంగ ప‌ఠనానికి భిన్నంగా ఈ ఏడాది ఏపీ రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న పెద్ద‌గా క‌నిపించ‌లేదు. స‌రే.. రాజ‌కీయ నేత‌లు, పార్టీలు, ప్ర‌భుత్వాల పంచాంగం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు మాత్రం సోష‌ల్ మీడియాలో త‌మ `పంచాంగం` గురించి కూడా వినిపించుకోవాలంటూ.. ఆస‌క్తిక‌ర ట్వీట్లు.. పోస్టులు పెడుతున్నారు.

ఇటు రాష్ట్ర‌, అటు కేంద్ర ప్ర‌భుత్వాల‌ను స‌టైర్ల‌తో ప్ర‌జ‌లు కుమ్మేశారు. ``వంట గ్యాస్ సిలెండ‌రు ధ‌ర‌లో మ‌రో 100 పెంచినా ఆశ్చ ర్యం లేదు. వ‌చ్చేది ఎన్నిక‌ల సీజ‌న్ కాబ‌ట్టి రాబోయే ఆరు మాసాలు ప్ర‌భుత్వాల `వ‌డ్డ‌న‌`కు సిద్ధంగా ఉండాలి. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు ఖాయం. ప్ర‌తి నెలా రూ.150 చొప్పున అద‌నంగా కేటాయించాల్సిందే. ఇసుక కుంభ‌కోణాలు.. మ‌ట్టి కుంభ‌కోణాలు పెరుగుతాయి. ఎందుకంటే ఎన్నిక‌లు కార‌ణం. బ్యాంకులు మ‌రిన్ని వ‌డ్డీలు రాబ‌ట్టే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఎందుకంటే.. ద్ర‌వ్యోల్బ‌ణం కాచుకుని కూర్చుంది`` అని యువ‌కులు ఆసక్తిగా ట్వీట్ చేస్తున్నారు.

అదేస‌మ‌యంలో  మ‌రికొంద‌రు... ``మోడీ స‌ర్కారు.. మ‌రిన్ని రాష్ట్రాల‌పై త‌న ప్ర‌తాపం చూపించే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. రాబోయే నాలుగు మాసాల‌లో మూడు కీల‌క రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఏపీలో రోడ్లు మ‌రోసారి వేయాల్సి రావొచ్చు. ఈ సారి రోడ్ల కోసం ప్ర‌త్యేక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టినా ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే..నేత‌లు ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో పాద‌యాత్ర‌ల‌కు మ‌రింత డిమాండ్ పెరుగుతోంది. దీంతో రోడ్లు కుంగిపోవ‌డం ఖాయం. వ‌ర్షాలు ఎలా ఉన్నా... ప్ర‌జ‌లను వ‌రాల జ‌ల్లుల్లో ముంచెత్తేందుకు నాయ‌కులు రెడీగా ఉన్నారు`` అని పంచాంగ వ్యాఖ్య‌లు చేశారు.

ఇంకొంద‌రు.. ``ఏపీలో ఆర్థిక ప‌రిస్థితి వ‌క్ర మార్గంలో న‌డుస్తున్నందున మ‌రిన్ని అప్పులుచేసే అవ‌కాశం ఉంది. పాల‌కుల‌కు పంచడ‌మే త‌ప్ప‌..  పెట్టుబ‌డుల‌పై దృష్టి మంద‌గించిన కార‌ణంగా ఏపీలో అభివృద్ధి మ‌రింత కుంటు ప‌డ‌వ‌చ్చు. ఖ‌జానా కొల్ల‌బోతున్నందున మ‌రిన్ని ప‌న్ను పోట్లు ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అధికారం కోసం నాయ‌కులు నానా మాట‌ల‌తో విరుచుకుప‌డ‌డంతో టీవీల రేటింగుల‌కు తిరుగు ఉండ‌క‌పోచ్చు`` ఇలా.. ఉగాది పేరిట పంచాంగాల‌ను వండివార్చుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News