టీ సచివాలయం వాస్తుదోషం అలా పోతుందట

Update: 2016-07-10 05:15 GMT
నమ్మకాలేమో కానీ.. తెలంగాణ ఖజానా మీద భారీగా భారం పడేలా చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న వాస్తు నమ్మకం ఇప్పుడున్న సచివాలయాన్ని పడగొట్టేలా చేస్తుందన్నది బహిరంగ రహస్యం. భవనం పాతదైందని.. వసతులు సరిగా లేవంటూ కూలగొట్టేందుకు సిద్ధమవుతున్న ఈ భవంతులకు వాస్తు దోషం ఉందన్న విషయాన్ని కేసీఆర్ ఎంతబాగా నమ్ముతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పాతిక నెలలు దాటుతున్నా.. పాతికసార్లు కూడా ఆయన తెలంగాణ సచివాలయం ముఖం చూడకపోవటానికి వాస్తు దోషం మీద ఆయనకున్న నమ్మకమే అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భవనాల్ని కూల్చేస్తే వాస్తుదోషం పోతుందా? అన్నది ఒక ప్రశ్న. ఈ సందేహానికి తాజాగా సమాధానం లభించింది. భవనాల్ని కూలగొట్టి కొత్తవి కట్టేస్తే వాస్తు దోషం పోదని.. దాంతో పాటు.. ఇప్పుడున్న సచివాలయం స్థలానికి మరికొంత భూమిని అదనంగా చేర్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

అదెలా అన్న విషయానికి వస్తే.. మింట్ వైపు నుంచి ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంక్ వరకూ కొంత స్థలాన్ని తొలగించి.. రోడ్డును విస్తరించాలని.. అలా చేస్తే.. వాస్తు దోషం పోతుందని నిపుణులు చెప్పినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే మార్పులు చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇలా చేస్తే రూపురేఖలు ఎలా ఉంటాయన్న విషయాన్ని సరి చూసుకునేందుకు వీలుగా తొలుత మ్యాప్ లు సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నమ్మకాల గోలేందోకానీ కొత్త సచివాలయానికి దాదాపు వెయ్యి కోట్ల వరకూ భారం తెలంగాణ ఖజానా మీద పడనుండటం గమనార్హం.
Tags:    

Similar News