అహో మహా నేతా : అక్కడ విమర్శలు... ఇక్కడ పొగడ్తలు

Update: 2022-12-01 09:57 GMT
ఆయన ఉమ్మడి ఏపీని అయిదుంపావు ఏళ్ళ పాటు జనరంజంకంగా పాలించిన మహా నేత. ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రెండు సార్లు సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఆయన తనదైన మార్క్ ని పాలనలో వేసుకున్నారు. బీద జనం వద్ద మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఆయన మరణానంతరం ఏపీ రెండుగా చీలింది అంటే ఆయన పవర్ ఏంటి, ఆయన ఎంతటి బలవంతుడైన నాయకుడు అన్నది అర్ధం అవుతుంది.

వైఎస్సార్ ఉంటే ఏపీ రెండుగా విడిపోయేదా అన్న చర్చ ఎపుడూ విభజన ఏపీలో సాగుతూ ఉంటుంది. అదే టైం లో ఆయన బతికి ఉంటే తెలంగాణా వచ్చేది కాదు అని టీయారెస్ లాంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తూంటాయి. ఇక ఇపుడు చూస్తే వైఎస్సార్ దివంగతులై ఏకంగా 13 ఏళ్లు గడిచాయి. అయినా ఆయన తెలుగు నాట రాజకీయాల్లో నిత్యం మారుమోగుతున్నారు.

ఏపీలో ఆయన రాజకీయ వారసుడు వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. వైసీపీలో వైఎస్సార్ గురించి ఎంతలా చెబుతున్నా జగన్ సీఎం అయ్యాక   వైఎస్సార్  కంటే  జగన్  గురించి అంతకంటే ఎక్కువగా చెప్పడం మొదలైంది  అంటున్నారు. దాంతో మహా నేతను విపక్షాలు ఇపుడు అందిపుచ్చుకుంటున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే వైఎస్సార్ ని ఇటీవల కాలంలో బాగా పొగుడుతూ వస్తోంది. ఆయన గొప్పవారు, మంచి నేత అని కూడా అంటోంది.

చంద్రబాబు అయితే అడుగు ముందుకేసి వైఎస్సార్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసుకున్నారు. ఒకే మంచం, ఒకే కంచంగా తామిద్దరం దశాబ్దం పాటు కలసిమెలసి తిరిగామని కూడా పాత ముచ్చట్లు వల్లె వేశారు. వైఎస్సార్ గ్రేట్ లీడర్ అని ఆయన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలక్రిష్ణ కూడా ఒక సందర్భంలో అన్నారు. ఇక టీడీపీ మాజీ మంత్రులు అయితే వైఎస్సార్ పాలన చాలా బెటర్ ఆయన విపక్షాలకు ఎంతో విలువ ఇచ్చేవారు అంటూ జగన్ ఏలుబడితో పోలిస్తూ తరచూ సంచలన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

ఇక్కడ లాజిక్ ఏంటి అంటే వైఎస్సార్ ని పొగిడడం ద్వారా జగన్ని తగ్గిస్తే వైసీపీ ఇమేజ్ డౌన్ అయి అది తమకు బాగా ఉపయోగపడుతుంది అన్నది రాజకీయ ఎత్తుగడ. అందుకే ఏపీలో విపక్షం వైఎస్సార్ ఈజ్ గ్రేట్ అంటోంది. అదే తెలంగాణాలో చూస్తే అధికార టీయారెస్ ఏపీ గురించి మాట్లాడినా ఏపీలోని నేతల గురించి ప్రస్తావనకు తెచ్చినపుడల్ల వైఎస్సార్ ని విమర్శిస్తూ వస్తుంది. వైఎస్సార్ వల్లనే తెలంగాణా ఆలస్యం అయిందని, ఆత్మ బలిదానాలు చాలా జరగడానికి వైఎస్సార్ కారణం అని టీయారెస్ మంత్రులు కూడా అంటున్నారు.

ఇపుడు అది కాస్తా మరింతగా హీట్ ని పెంచుతోంది. తెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీని పెట్టి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో పాటు ఇటీవల జరిగిన ఆమె అరెస్ట్ ఇతర సంఘటనల నేపధ్యంలో టీయారెస్ నేతలు టోన్ పెంచేశారు. వైఎస్సార్ ని వారు గట్టిగా ఘాటుగా విమర్శిస్తున్నారు. వైఎస్సార్ రాజ్యం వద్దు అని అంటున్నారు. ఆయన పాలనలో తెలంగాణకు ఏమీ మేలు జరగలేదు అంటూ ఆడిపోసుకుంటున్నారు.

ఇదంతా చూస్తే ఫక్తు రాజకీయం అని చెప్పకతప్పదు. వైఎస్సార్ ని గట్టిగా నిందించకపోతే టీయారెస్ కి తెలంగాణా వేడి వాడి పూర్తి స్థాయిలో రగిలే అవకాశం లేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆయన్ని పక్కా సమైక్యవాదిగా ఆంధ్రా వాదిగా చూపించడం ద్వారానే బహుముఖ రాజకీయ ప్రయోజనాల కోసం టీయారెస్ చూస్తోంది అంటున్నారు. ఇపుడు షర్మిల దూకుడు చేస్తున్నారు. ఆమె రాజకీయంగా ఎంత రచ్చ చేస్తే అంతకు మించి వైఎస్సార్ ని ముగ్గులోకి లాగి రాజకీయంగా ఆయన్ని విమర్శించేందుకు టీయారెస్ వెనకాడదు అని అంటున్నారు.

టోటల్ గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే వైఎస్సార్ రెండుగా కనిపిస్తున్నారు. ఒక చోట ఆయన మీద పొగడ్తల ద్వారా వారసుడు జగన్ని తగ్గించాలని చూస్తూంటే మరో చోట ఆయన్ని విమర్శించడం ద్వారా షర్మిలను తగ్గించాలని ప్రయత్నం జరుగుతోంది. రాజకీయ తమాషా అంటే ఇదే మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News