రక్తం మరిగిపోయే చేష్టలకు పాల్పడిన వారిని ఏం చేశారంటే?

Update: 2021-10-27 06:02 GMT
ప్రజాస్వామ్యం లో భావ ప్రకటనా స్వేచ్ఛ తప్పేం కాదు. కానీ.. జాతిని అవమానించేలా.. దేశ భక్తి అన్నది కించిత్ కూడా లేదన్నట్లు గా వ్యవహరించే వారి విషయం లో మరింత కఠినం గా వ్యవహరించాల్సిన సమయం అసన్నమైంది. ప్రపంచం లో ఏ దేశంలోని వారైనా సరే.. తమకున్న భేదాభిప్రాయాల్నిపక్కన పెట్టేసి.. ఆటల్లో తమ దేశం మాత్రమే గెలవాలని కోరుకుంటారు. ఒక వేళ.. తమ దేశ జట్టు ఓడితే తీవ్రమైన మనో వేదనకు గురవుతారు. ఈ విషయం లో మరెక్కడా లేని రీతి లో మన దేశం లో మాత్రం అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

తాజాగా పాకిస్తాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఓడిపోవటం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత.. గెలుపు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులంతా కుంగిపోతే.. అందుకు భిన్నంగా కొందరు మాత్రం పాకిస్తాన్ జట్టు గెలవటాన్ని సంబరాలు చేసుకున్న వైనం మరింత బాధించింది. ఒక దేశంలో ఉంటూ.. ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. పరాయి జట్టు.. అందునా మన శత్రు దేశంగా వ్యవహరించే ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే జట్టు గెలుపునుసంబరం చేసుకోవటం అంటే అంతకు మించిన దుర్మార్గం ఇంకేం ఉంటుంది.

ఇలాంటి ఉదంతాల గురించి విన్నంతనే రక్తం మరిగిపోతుంది. ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశాన్ని ప్రేమించిన వారిని ఈ దేశంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. అలాంటి వారిని వెంటనే వారు అభిమానించే దేశాలకు పంపించేస్తే సరిపోతుంది. ఒకవేళ.. మేం భారత్ లోనే ఉంటాం.. పాక్ ను అభిమానిస్తామని వాదించే మూర్ఖుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి ఎదురయ్యాక.. సంబరాలు చేసుకున్న వైనం పై టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. షేర్ -ఎ- కశ్మీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థుల పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇలా కేసులు నమోదు చేయటాన్ని మాజీ ముఖ్య మంత్రి మెహబూబా ముఫ్తీ తప్పు పట్టారు. కశ్మీర్ విద్యార్థుల పై మోడీ సర్కారు ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆమెమండిపడ్డారు. నిజానికి సదరు విద్యార్థుల్ని మాత్రమే కాదు.. ఇలాంటి రాజకీయ నేతల్ని సైతం చట్ట ప్రకారం శిక్షించటం.. అవసరమైతే.. పాక్ సరిహద్దు వద్ద వదిలి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మాటలకు కొందరు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కానీ.. ఒక దేశంలో ఉండి.. ఆ దేశానికి కాకుండా ఆ దేశ శత్రు దేశాని కి మద్దతు గా సంబరాలు చేసుకోవటం దేనికి నిదర్శనం? నిజానికి ఇలాంటి పరిస్థితే పాకిస్తాన్ లో చోటు చేసుకుంటుందా?

జమ్ముకశ్మీర్ లో మాత్రమే కాదు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన ఒక ప్రైవేటు స్కూల్ టీచరు సైతం తన వాట్సాప్ స్టేటస్ లో పాక్ గెలుపును పోస్టు చేయటం పైనా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ లెక్కన బయటకు వచ్చినోళ్లే ఇంతమంది ఉంటే.. బయటకు రాని వారెందరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వారి పై చట్ట ప్రకారం కఠినం గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News