అమ‌రావ‌తి భూముల తాక‌ట్టుకే.. కార్పొరేష‌న్: సోమిరెడ్డి ఫైర్‌

Update: 2022-01-06 10:30 GMT
ఏపీ స‌ర్కారుపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్న మొన్న‌టి వ‌రకు అమ‌రావ‌తిని శ్మ‌శానం.. ఎందుకుప‌నికిరాద‌ని వ్యాఖ్యానించిన‌.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు కార్పొరేష‌న్ పాట‌పాడుతున్నార‌ని.. దీనివెనుక‌.. భారీ ఎత్తున అప్పులు తెచ్చుకునే వ్యూహం దాగి ఉంద‌ని సోమిరెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ఆంధ్రుల ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచిన అమ‌రావ‌తిని స్మశానం, గ్రాఫిక్స్ అని తిట్టిన వైసీపీ నేతలు.., నేడు అమరావతి భూముల్ని తాకట్టు పెట్టేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని మండిప‌డ్డారు.

తాజాగా గుంటూరు జిల్లా అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నార ని విమర్శించారు. అమరావతి కోర్ కేపిటల్ ఏరియా 29 గ్రామాల్ని19 గ్రామాలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అన్యాయమని అన్నారు.

అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్‌ను 19 గ్రామాలకు పరిమితం చేసి 10 గ్రామాలను వదిలేయ టం సరికాదన్నారు. 29 గ్రామాలు కాకుండా 19 గ్రామాల కార్పొరేషన్లను ఏర్పాటు చేయటం కోర్టు ఉల్లంఘన అవుతుందన్నారు. శ్మశానం, ఎడారి, గ్రాఫిక్స్ అని విమర్శించిన రాజధానిని ఏ విధంగా తాకట్టుపెడతారని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువ చేసే 34 వేల ఎకరాలను 29 గ్రామాల రైతులు ఉచితంగా ఇచ్చింది తాకట్టుపట్టడానికి కాదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజధాని పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్నా తమ అనుమతి తీసుకోవాలన్న న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుందని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని రైతులు కోరుకుంటున్నట్లు 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా, వారికి న్యాయం చేయకుండా.. వారు త్యాగం చేసిన భూములపై జగన్ రెడ్డి కన్నుపడటం దుర్మార్గమని దుయ్యబట్టారు.

రైతులు పండించే అన్నం తింటున్న సీఎం జగన్, పాలన చేతకాక చివరకు రైతులనే మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని, ఇప్ప‌టికైనా ప్రభుత్వం వెనక్కు తగ్గితే మంచిదని సోమిరెడ్డి హితవు పలికారు.


Tags:    

Similar News