సోమిరెడ్డికి ఝ‌లక్‌!... మంత్రిగిరీకి రాజీనామానేనా?

Update: 2019-04-30 16:32 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి నిజంగానే గ‌ట్టి షాక్ త‌గిలింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో అమ‌లులోకి వ‌చ్చిన ఎన్నిక‌ల కోడ్‌.. మంత్రుల‌తో పాటు సీఎంల అధికారుల‌కు గండి కొట్టేసింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌కు త‌ప్పించి ఇత‌ర సాధార‌ణ ప‌రిపాల‌న‌కు సంబంధించి మంత్రులు - ముఖ్య‌మంత్రులు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోజాల‌రని కోడ్ చెబుతోంది. అయితే పోలింగ్ కు కౌంటింగ్ కు ఏకంగా నెల‌న్న‌ర స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో ఎన్నికైన త‌మ ప్ర‌భుత్వానికి ఉన్న అధికారాల‌ను ఎలా లాగేస్తారంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబుతో పాటు టీడీపీ కేబినెట్ లోని మంత్రులు - ఆ పార్టీ నేత‌లు త‌మ‌దైన శైలి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ విష‌యంలో సోమిరెడ్డి మ‌రో అడుగు ముందుకేసి... తాను త‌న శాఖ‌కు సంబంధించి స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని - ఆ స‌మీక్ష‌ను ఎలా అడ్డుకుంటారో చూస్తాన‌ని స‌వాల్ విసిరారు. అంతేకాకుండా త‌న స‌మీక్ష‌ను అడ్డుకుంటే మంత్రి ప‌ద‌వికి రాజీనామా కూడా చేసి పారేస్తాన‌ని కూడా ఓ మాట అనేశారు. అయితే ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురుకాబోతున్నాయ‌న్న విష‌యాన్ని మాత్రం ఆయ‌న ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఇదే విష‌యంలో సోమిరెడ్ది కంటే ముందే గ‌ళం విప్పిన చంద్ర‌బాబు... వాస్త‌వ ప‌రిస్థితిని అంచ‌నా వేసి స‌మీక్ష‌ల‌కు దూరంగా ఉన్నారు. సోమిరెడ్డి మాత్రం అలా దూరం ఉండేందుకు స‌సేమిరా అన్నారు.

తాను విసిరిన స‌వాల్ మేర‌కు నేడు ఆయ‌న స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్ కు వ‌చ్చారు. అప్ప‌టికే తాను స‌మీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లుగా ఆయ‌న సంబంధిత అధికారుల‌కు స‌మాచారం కూడా చేర‌వేశారు. అయితే సోమిరెడ్డికి షాకిస్తూ... ఒక్క‌రంటే ఒక్క అధికారి కూడా ఈ స‌మీక్ష‌కు రాలేదు. త‌న సొంత శాఖ‌కు చెందిన క‌మిష‌న‌ర్‌, ముఖ్య కార్య‌ద‌ర్శి కూడా ఈ స‌మీక్ష‌కు రాలేదు. తాము వేరే జిల్లాల‌కు చెందిన స‌మీక్ష‌ల్లో బిజీగా ఉన్నామ‌ని, మీ స‌మీక్ష‌కు రాలేక‌పోతున్నామ‌ని కూడా వారిద్ద‌రూ సోమిరెడ్డికి స‌మాచారం ఇచ్చార‌ట‌. ఈ నేప‌థ్యంలో దాదాపుగా రెండు గంట‌ల పాటు త‌న ఛాంబ‌ర్ లోనే వేచి ఉన్న సోమిరెడ్డి చివ‌ర‌కు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా బాగానే ఉన్నా... మ‌రి త‌న స‌మీక్ష‌ను అడ్డుకుంటే మంత్రి ప‌ద‌వికి కూడా రాజీనామా చేసేస్తానంటూ సోమిరెడ్డి నోట నుంచి వ‌చ్చిన మాట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చెప్పిన మాట మేర‌కు స‌మీక్ష‌కు అధికారులు రాలేని వైనానికి నిర‌స‌న‌గా సోమిరెడ్డి మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తారా?  లేదంటే... అలాగే కొన‌సాగిపోతారా? అన్న‌ది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News