సోము... టోటల్ ఫెయిల్యూర్ నా...?

Update: 2022-01-28 17:30 GMT
పాపం ఏపీ బీజేపీ. అసలే అలా ఉనికి పోరాటం చేస్తోంది. దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సీన్ ఉంది. అలాంటి బీజేపీకి కొత్త కామందుగా వచ్చి సోము వీర్రాజు ఉద్ధరిస్తారని అంతా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే సోము బీజేపీలో చాలా సీనియర్. పైగా ఆయనకు అవకాశం ప్రతీ సారి ఇలా వచ్చి అలా పోతోంది. దాంతో సానుభూతి కూడా పార్టీ బయటా లోపలా వెల్లువెత్తింది.

మరో విషయం ఏంటి అంటే ఆయన గోదావరి జిల్లాలకు చెందిన వారు బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో పాటు ఆరెస్సెస్ నేపధ్యం ఉంది. మరో వైపు ముక్కుసూటిగా మాట్లాడుతారు, ఫైర్ బ్రాండ్ అన్న ట్యాగ్ కూడా ఉంది. ఇవన్నీ కలసి సోము వీర్రాజు బీజేపీకి ప్రెసిడెంట్ అయితే ఒక్క లెక్కన ఊపేస్తారు అన్న అంచనాలు ఇటు క్యాడర్ తో పాటు అటు ఢిల్లీ నాయకత్వంలోనూ మెండుగా ఉన్నాయి.

మొత్తానికి చూస్తే సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక ఏం సాధించారు అంటే కమలానికి ఉన్న ఒక్కో రేకూ కూడా రాలిపోతోంది అన్న ఆవేదనను మాత్రమే మిగిల్చారు అన్నదే ఉంది. సోము వీర్రాజు బీజేపీ అధినేతగా సరైన పొలిటికల్ లైన్ తీసుకోలేకపోయారు అన్న మాటా ఉంది. ఆయన ఎంతసేపూ చంద్రబాబునే టార్గెట్ చేస్తూ అధికార వైసీపీని పక్కన పెట్టడం తోనే ఆయన తొలి ఫెయిల్యూర్ అలా మూటకట్టుకున్నారు.

అదే విధంగా ఏపీ బీజేపీకి బలంగా ఉన్న నాయకులు కూడా సోము పోకడలు చూసి దూరం అయ్యారన్న విమర్శలు వచ్చాయి.  ఇంకో వైపు చూస్తే బీజేపీకి దోస్త్ గా ఉన్న జనసేన కూడా ఎడం అయిపోయింది. జనసేన బీజేపీ కలసి ఉమ్మడిగా ఒక్క కార్యక్రమం కూడా ఏపీలో లేదు అంటే అది నిజంగా నాయకత్వ‌ వైఫల్యం అని అంటారు.

ఏపీలో అధికార వైసీపీని పక్కన పెట్టి ఎంతసేపూ టీడీపీని సోము  విమర్శించడం ద్వారానే గాడి తప్పారని సొంత పార్టీలోనూ విమర్శలు వచ్చాయి. ఇక ఏపీలో అతి పెద్ద ఇష్యూగా ఉన్న అమరావతి రాజధాని విషయంలో బీజేపీ మద్దతు ఇచ్చి కూడా ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం విచిత్రమే. ఢిల్లీ నుంచి అమిత్ షా వచ్చి తిరుపతిలో క్లాస్ పీకాక కానీ బీజేపీ పెద్దలు కదల్లేదు.

ఈ పరిస్థితుల్లో నాటి నుంచి కాస్తా వేడి పుట్టినట్లుంది. సోము హడావుడి కూడా అప్పటి నుంచే ఎక్కువ అయిందని కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ఆయన వైసీపీని గట్టిగా విమర్శించాలనుకుని ఆ జోరులో చేస్తున్న తడబాట్లూ పొరపాట్లే ఇపుడు శాంతం పార్టీ కొంప ముంచేలా ఉన్నాయని అంటున్నారు.

ఈ మధ్య విజయవాడలో బీజేపీ బలం పెరగడానికి రాజకీయ ఉనికి నిలవడానికి అన్నట్లుగా ప్రజాగ్రహ సభ నిర్వహిస్తే ఆ సభలో సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ కామెంట్స్ పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి. సభ ఉద్దేశ్యమే టోటల్ గా పక్క దోవ పట్టేసింది. పొలిటికల్ మైలేజ్ దేముడెరుగు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా సీన్ సాగింది.

దాన్ని కవర్ చేయడానికా అన్నట్లుగా గుంటూరులో జిన్నా టవర్ల మీద పడ్డారని కూడా విమర్శలు వచ్చాయి. ఇది కూడా బూమరాంగ్ అయింది. ఇక కేంద్ర పధకాలను ఏపీ సర్కార్ తమ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటోంది అని బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో అంటున్న మాట. దాన్ని జనాల్లో పెట్టి పార్టీకి ప్లస్ అయ్యేలా చూడాలన్న ఆదేశాలు ఉన్నాయి.

వాటి మీద తమ గొప్పతనాన్ని  సజావుగా చెప్పుకోవచ్చు. ఉన్న దాన్ని వివరించవచ్చు. అయితే సోము వీర్రాజు వీరావేశంలో విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ జిల్లాకో  ఎయిర్ పోర్టుల ప్రకటనల మీద చేసిన కామెంట్స్ తో పాటు,  కడప జిల్లా వాసుల మీద అనుచిత కామెంట్స్ చేసినట్లుగా ప్రచారం కావడంతో బీజేపీ నేతలు తలపట్టుకునే పరిస్థితి వస్తోంది.

ఒక జిల్లా వాసులను పట్టుకుని అలా మాట్లాడడమే కాకుండా తాను అనలేదని, వక్రీకరించారని చెప్పుకుంటూ ఆయన చేసిన మరో ప్రయత్నం కూడా పార్టీకి చిక్కులు తెచ్చేలాగానే ఉంది అంటున్నారు. పైగా తాను ఒకవేళ అలా అన్నట్లుగా ఎవరైనా భావిస్తే దానికి చింతిస్తున్నాను అన్న మాట కూడా సోము నోట రాకపోవడం పట్ల కూడా పార్టీ లోపలా బయటా గుర్రుగా ఉన్నారు అంతా.

ఇవన్నీ చూస్తూంటే సోము  ప్రెసిడెంట్ గిరీకి పెద్ద ముప్పే వచ్చేసింది అంటున్నారు. సోము వీర్రాజు కంటే గత ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ చాలా బెటర్ అన్న మాట వినిపిస్తోంది అంటే సీటు పూర్తిగా  జారినట్లే అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి సోము వచ్చి ఏం చేశారూ  అంటే ఉన్న చోట నుంచి మరింత వెనక్కి పార్టీని లాగేశారు అన్న మాట అంతర్మధనం అయితే కాషాయ దళంలో జరుగుతోందిట. మరి సోము కుర్చీ ఖాళీ చేయాల్సిందే అని  అంటున్నారంటే అదంతా వీర్రాజు మాస్టారు చేసుకున్న స్వీయ తప్పిదమే అంటే కాదన్న వారు ఉండరేమో.
Tags:    

Similar News