ఏపీలో ప్రభుత్వం ఉందా లేక ఎమర్జన్సీ ఉందా ... పోలీసులపై మండిపడ్డ సోము వీర్రాజు

Update: 2021-01-21 12:59 GMT
ఏపీలో ఆలయాలపై దాడుల వ్యవహారం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ కు, ఏపీ బీజేపీ నేతల మధ్య వివాదం మరింత ముదిరింది. రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు కొందరు బీజేపీ కార్యకర్తలకు సంబంధం ఉందంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

 తమ పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన డీజీపీ ఈనెల 20లోగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా జరగని క్రమంలో తీవ్ర పరిణామాలుంటాయని, డీజీపీపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కమలనాథుల విధించిన డెడ్ లైన్ పూర్తికావడంతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

విజవాడలోని డీజీపీ ఆఫీస్ ఎదుట నిరసనలు చేసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలు విజయవాడకు చేరుకోవడంతో ,  పోలీసులు బీజేపీ ముఖ్యనేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. ఈ క్రమంలోనే సోము ఇంటికి వెళ్ళగా ఆయన పోలీసుల మీద ఫైర్ అయ్యారు. తన ఇంటికి ఇంత మంది ఎందుకు వచ్చారు అంటూ పోలీసుల మీద ఆయన మండి పడినట్లు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

 ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాను అంత మంది వచ్చి ఇబ్బంది పెడతారు ఏంటి, నేనేమన్నా దొంగనా , ఇంత మంది పోలీసులు వచ్చి ఎందుకు తలుపులు కొడుతున్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా లేక ఎమర్జన్సీ ఉందా , అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తే కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్న ఆయన, పడిపోయిన దేవాలయాల గురించి పోస్టులు పెడితే కేసులు పెట్టారని అన్నారు. ముందు అసలు రాజకీయ పార్టీల ప్రమేయం లేదని పేర్కొన్న డీజీపీ ఆతర్వాత పార్టీల పేర్లు చెప్పారని సోము వీర్రాజు అన్నారు.
Tags:    

Similar News