కిలో బియ్యం రూపాయి.. ఇసుక రూ.3

Update: 2015-08-05 04:21 GMT
ఏపీ అధికారపక్షానికి ఊహించని పంచ్ పడింది. అధికారం చేపట్టిన పద్నాలుగు నెలల్లో ఇంత తీవ్రమైన పంచ్ ఇప్పటివరకూ పడలేదనే చెప్పాలి. ఏపీ సర్కారు వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా చేసిన ఈ వ్యాఖ్య ఏపీ అధికారపక్షానికి షాక్ తగిలేలా ఉంది.

మిత్రపక్షం అంటే.. మర్యాదగా చూస్తుండిపోవటం.. అవసరానికి కూడా మాటలు రానట్లుగా ఉండిపోవటం అన్నట్లుగా వ్యవహరించే తెలుగు తమ్ముళ్లకు సెగ పుట్టేలా ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శ ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. అధికారపక్ష వైఫల్యాన్ని తన సింగిల్ స్టేట్ మెంట్ తో స్టేట్ మొత్తం అర్థమయ్యేలా చేశారని చెబుతున్నారు.

ఇసుక రీచ్ విషయంలో తెలుగు తమ్ముళ్ల ‘‘అతి’’పై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆకాశానికి అంటేలా ఇసుక ధర పెంచేయటంతో.. నిర్మాణ రంగం భారీగా ప్రభావితం కావటంతో పాటు.. నిర్మాణ దారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి.

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కిలో రూపాయికే దొరుకుతుంటే.. ఇసుక మాత్రం కిలో మూడు రూపాయిల చొప్పున అమ్ముతున్నారంటూ వీర్రాజు చేసిన వ్యాఖ్య వణుకు పుట్టేలా చేస్తోంది. తన వ్యాఖ్యతో ప్రభుత్వం వైఫల్యం.. చేతకానితనంతోపాటు.. విచ్చలవిడితనాన్ని చెప్పకనే చెప్పేసినట్లు అవుతుందన్న వాదన వినిపిస్తోంది. సోము వీర్రాజు చేసిన విమర్శ ఇక్కడితో ఆగదని.. ఈ విమర్శ ఏపీ విపక్షానికి ఒక అస్త్రంగా మారటం ఖాయమని చెబుతున్నారు. మరి.. తెలుగు తమ్ముళ్లు తమ మిత్రుడి విమర్శనాస్త్రానికి ఎలాంటి బదులిస్తారో చూడాలి.
Tags:    

Similar News