వీర్రాజుకే ఏపీ ప‌గ్గాలు...అమిత్‌ షా కొత్త స్కెచ్‌

Update: 2018-04-20 05:20 GMT
సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల‌కే ప‌రిమిత‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ ర‌థ‌సార‌థి ప్ర‌క్రియ పూర్తి అయింది. పార్టీ సీనియ‌ర్లు - టీడీపీని గ‌ట్టిగా ఎదుర్కునే నేతలు - పార్టీని బ‌లోపేతం చేయ‌గ‌లిగే సామ‌ర్థ్య‌మున్న‌నాయ‌కులు...ఇలా ప‌లుర‌కాలా వ‌డ‌పోత‌ల అనంత‌రం ఈ ప్ర‌క్రియ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.  ఇందులో ప్ర‌ధానంగా ఇటీవ‌ల మారిన స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం...టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై దూకుడుగా స్పందించే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి వరించింద‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని నేడు అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న హ‌రిబాబు రాజీనామా నేప‌థ్యంలో కొత్త అధ్య‌క్షుడి ఎంపిక త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌లు క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టి అన్ని అంశాల‌ను కూలంక‌షంగా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర బీజేపీ ముఖ్య‌నాయ‌కుల్లో రెండుగా చీలిక ఉందనే విష‌యాన్ని వారు గ‌మ‌నించారని అంటున్నారు. తాజామాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌ టీడీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి - మాజీ మంత్రి మాణిక్యాల‌రావు వంటివారు వ్యతిరేక వ‌ర్గ‌మ‌నే చ‌ర్చ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారని స‌మాచారం. ఈ నేత‌లు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించడంలో ముందుంటుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వివ‌రిస్తున్నారు. ఈ కోణంలో ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కు ఆఫర్ ఇచ్చిన అధిష్టానం, మాణిక్యాలరావు ఆసక్తిగా లేకపోవడంతో సోము వీర్రాజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అయిన సోము వీర్రాజు మొదటి నుంచి టీడీపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..టీడీపీ నాయకులపై దూకుడుగా ఉండటం, పార్టీలో అందరి నాయకులతో కలిసి పోవడం వంటి వాటితో సంతృప్తి చెందిన బీజేపీ అధిష్టానం ఆయనకు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఇవ్వనున్నారని స‌మాచారం. టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారిలో  వీర్రాజు ముందువరసలో నిలుస్తారు. గ‌తంలోనే వీర్రాజు పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ....ఆయ‌న్ను అధ్యక్షుడుగా నియమిస్తే మిత్రపక్షమైన టీడీపీ ఎలా స్పందిస్తుందోనన్న సందేహం నెల‌కొంది. అయితే ఎన్డీఏకు టీడీపీ గుడ్‌ బై చెప్పేయ‌డంతో పాటుగా ఇటీవ‌ల ఎదురుదాడి చేస్తున్న నేప‌థ్యంలో అందుకు త‌గిన నాయ‌కుడిని అధ్య‌క్షుడిని చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో టీడీపీని వ్యతిరేకించడంతో పాటుగా దూకుడుగా స్పందించే వీర్రాజుకు అవకాశం ఇస్తున్న‌ట్లు స‌మాచారం. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్తున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత అమిత్ షా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తార‌ని ఈ సంద‌ర్భంగా బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసేలా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని స‌మాచారం.


Tags:    

Similar News