సోము వీర్రాజు వీరంగం అందుకేనా?

Update: 2015-10-25 09:03 GMT
ఏపీ బీజీపీలో నిత్యం చంద్రబాబుపై రాళ్లేసే ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విమర్శలవర్షం కురిపించారు. ఈసారి ఆయన చంద్రబాబుతో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నూ టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం పైన తెలుగుదేశం పార్టీ నేత - ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు సరికాదని, ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పాలని వీర్రాజు ఆదివారం మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న నిరంతర విద్యుత్ - రుణమాఫీ కేంద్రం సహకారంతో చేసినవేనవేనంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాష్ట్రం నిర్వహించే కార్యక్రమాలలో బిజెపి నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇవ్వనని ఎప్పుడూ చెప్పలేదన్నారు. అడ్డంకులు తొలగించే ప్రయత్నంలో ఉన్నారని.. ప్రత్యేక హోదా రావడం ఖాయమని వీర్రాజు చెప్పారు. మోడీ ప్రసంగంపై గల్లా జయదేవ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను చంద్రబాబు సర్కారు తమవిగా ప్రచారం చేసుకుంటోందని వీర్రాజు విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాలపై కేవలం చంద్రబాబు చిత్రాన్ని మాత్రమే ప్రచురిస్తూ ఉండటం వెనుక మర్మమేమిటన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కాగా ఏపీ బీజేపీలో నలుగురైదుగురు చంద్రబాబుపై నిత్యం గుర్రుమంటున్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన పైడికొండల మాణిక్యాల రావు కొద్దికాలంగా తగ్గారు. కానీ, సోము వీర్రాజు మాత్రం రోజురోజుకీ స్పీడు పెంచుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో బీజేపీ అధ్యక్షులను మార్చుతారని... ఏపీలో ఆ అవకాశం దొరకబట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే... మిత్రపక్షంపై చీటికీ మాటికీ దండెత్తే నేతకు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే ఛాన్సే లేదని బీజేపీ నేతలే అంటున్నారు.
Tags:    

Similar News