బాబును మ‌ళ్లీ వాయించిన ప్రియ‌మైన శ‌త్రువు

Update: 2017-03-25 16:20 GMT
మిత్ర‌ప‌క్షమే అయిన్ప‌టికీ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏ మాత్రం వెనుకంజ వేయ‌రు. అవ‌కాశం దొరికిందంటే చాలు బాబుపై విరుచుకుప‌డే వీర్రాజు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, అమ‌రావ‌తి నిర్మాణం గురించి ఇటు చంద్ర‌బాబు తీరును, అటు టీడీపీ నేత‌ల‌ వైఖ‌రిని తూర్పార ప‌ట్టారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా కమిటీ హాల్లో పోస్టర్ డిజైన్ ప్రదర్శన ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు శాసనసభ్యులకు వివరించడంపై వీర్రాజు మండిప‌డ్డారు.

ఏపీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో పెద్ద ఎత్తున హ‌డావుడి చేస్తోందని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాలన్ని ఇలాగే హంగామా చేశాయా? అని ప్రభుత్వ తీరును సోము వీర్రాజు ప్ర‌శ్నించారు. ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయపూర్ ను ఆ రాష్ట్ర హౌజింగ్ బోర్డే నిర్మించిందని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటూ హంగామా చేస్తున్నాయని విమర్శించారు. ఇక నిర్మాణాల గురించి ప్ర‌స్తావిస్తూ ఇప్పుడున్నవి అసెంబ్లీ, సెక్ర‌టేరియ‌ట్‌లు కాదా? మళ్లీ కొత్తవి నిర్మించడం అవసరమా? ప‌్ర‌జాధ‌నం వృథా చేయ‌డం కాక‌పోతే ఏమిటిది? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం సంక్షేమంపై దృష్టి సారించి, ప్ర‌చార కాంక్ష‌ను త‌గ్గించుకోవాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగానే ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మిత్ర‌పక్ష‌మైన టీడీపీ తీరుపై వీర్రాజు మండిప‌డ్డారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ గెలుచుకోవ‌డాన్ని త‌మ ఖాతాలో వేసుకోవ‌డం ఏమిట‌ని వీర్రాజు ప్ర‌శ్నించారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ వల్లే తాము గెలిస్తే మిగతా చోట్ల టీడీపీ ఎందుకు ఓడిపోయిందో ఆ పార్టీ నేత‌లే చెప్పాల‌ని డిమాండ్ చేశారు. స‌రిగా స‌మ‌న్వ‌యం కూడా చేసుకోలేద‌న్నారు. అధికార పార్టీకి బీజేపీ ఇప్పుడు కొత్తిమీర కట్టలా కనిపిస్తోందని వీర్రాజు మండిపడ్డారు. పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం తమను కనీసం సంప్రదించకుండా వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News