బంగారంపై వీర్రాజుగారు రియాక్ట‌య్యారు

Update: 2016-12-03 10:48 GMT
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోమారు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ద్వంద్వ దోర‌ణి అవ‌లంభిస్తున్నార‌ని వీర్రాజు వ్యాఖ్యానించారు. నోట్ల రద్దును సీఎం చంద్ర‌బాబు స్వాగ‌తిస్తుంటే...కొంత మంది టీడీపీ నేతలు కావాలని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌రిదిద్దే దిశ‌గా తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని మేధావులు సైతం స్వాగ‌తిస్తుంటే మిత్ర‌ప‌క్షాలుగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం ఏమిట‌ని వీర్రాజు ప్ర‌శ్నించారు. భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా గాడిలో పెట్ట‌డానికి పెద్ద నోట్ల ర‌ద్దు తోడ్ప‌డుతుంద‌ని చెప్పారు.  బీజేపీతో పొత్తు కంటే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తేనే ఎక్కువ సీట్లు వస్తాయని వస్తున్న సర్వేలపై వీర్రాజు వెట‌కారంగా స్పందించారు. ఈ స‌ర్వేల‌పై టీడీపీ నాయకులే స్పందించాలని, ఈ అంశాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలి వేస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం బంగారంపై విధించిన ఆంక్షలపై వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. ఈ ఆంక్ష‌లు ఇప్పుడే పెట్టినవి కాదని గతంలో ఉన్న వాటినే ప్రభుత్వం మరోసారి గుర్తు చేసిందని అన్నారు.అయితే కొంత మంది కావాల‌నే మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దేశంలో పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు ఎదురైన సమస్యలు త్వరలో తొలగిపోతాయని, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని వీర్రాజు భ‌రోసా వ్య‌క్తం చేశారు. కాగా ఇటీవ‌ల పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన రైతు సదస్సుకు భారీగా ఖర్చు చేశారన్న ఆరోపణలను వీర్రాజు తోసిపుచ్చారు. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో సభలు నిర్వహించాయని, వాటిపై తాము లెక్కలు అడిగామా? అని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News