ఆ ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా దోచుకుంటున్నారు

Update: 2017-12-04 07:17 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసనమండలి సభ్యుడు - భారతీయ జనతా పార్టీ ఏపీ ఫైర్ బ్రాండ్ నేత సోము వీర్రాజు ఏ విష‌యంపై స్ప‌దించినా...అది ఎంత ఘాటుగా - సూటిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. త‌మ‌ పార్టీ అయిన బీజేపీని ర‌క్షించుకుంటూ...ప్ర‌తిప‌క్షాల‌ను ఏకిపారేసే రీతిలోనే...మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీపై కూడా వీర్రాజు అంతే మొహ‌మాటం లేకుండా స్పందిస్తార‌నే పేరుంది. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పేసే వీర్రాజు తాజాగా ఏపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి `పందికొక్కుల్లా తింటున్నారు` అనే మాట వాడేశారు. అయితే ఆయ‌న విమ‌ర్శించింది అధికార పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించా..లేక‌పోతే...పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల‌నా అనేది అంతు చిక్క‌డం లేద‌ని అంటున్నారు. పైగా సూటిగా మాట్లాడే వీర్రాజు ఎందుకు ట్విస్ట్ ఇచ్చార‌ని చ‌ర్చించుకుంటున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించిన ‘బీసీ చైతన్య మహాసభ’కు హాజ‌రైన సోము వీర్రాజు ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం అవినీతికి అవకాశం కల్పించకుండా టెండర్లను 45 రోజుల పాటు ఆన్‌ లైన్‌ లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా టీడీపీ ప్రజాప్రతినిధులు అర్థం - పర్థం లేకుండా ప్రధాని మోడీని విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ప్రధాని మోడీ రాష్ట్రాలను కబళిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దగ్గర మోకాళ్లు ఒడ్డి - కండువాలు మార్చుకున్న వారు ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేలే పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను గాలికి వదిలి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందన్నారు.అయితే వీర్రాజు చేసిన ఈ విమ‌ర్శ‌లు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించేనా కాదంటే అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులనా? అంటూ కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులకు దమ్ము - ధైర్యం ఉంటే తొలుత హంద్రీ-నీవా - గాలేరు నగరి - తెలుగుగంగ వంటి పెండింగ్‌ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించేందుకు పోరాటం చేయాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపైనా వీర్రాజు నిర్మొహ‌మాటంగా నిప్పులు చెరిగారు.  కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే పట్టిసీమ అనతికాలంలో పూర్తయ్యేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని టీడీపీ ప్రజాప్రతినిధులు - అధికారులు పేర్కొన్నారని గుర్తుచేశారు. బీసీ వర్గానికి చెందిన మోడీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి ఉందన్నారు. అయితే తమ ప్రాంతానికి చెందిన ఓబీసీ రాష్ట్ర మంత్రికి కనీసం అధికారులను బదిలీ చేసే హక్కు కూడా లేకపోవడం దారుణమన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి పదవులను బీసీలకు కట్టబెట్టి పాలన విషయంలో నిజాయితీగా పని చేసేలా పూర్తిస్థాయిలో స్వేచ్ఛ కల్పిస్తోందని వీర్రాజు గుర్తు చేశారు.
Tags:    

Similar News