సోము వీర్రాజుకు ఛాన్సు ఉన్నట్లా లేనట్లా..?

Update: 2016-11-30 19:30 GMT
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం కాచుక్కూచున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు పాపం ఆ కోరిక అందని ద్రాక్షలా ఊరిస్తోంది. దేశంలోని రాష్ట్రాలన్నిటికీ బీజేపీ అధ్యక్షులను నియమిస్తున్నా ఏపీని మాత్రం పెండింగులో పెడుతున్నారు. దీంతో ఆయన ప్రతిసారీ ఆశపడడం... ఆ నియామకం ఆగిపోవడం జరుగుతోంది. ఈసారి కూడా బీజేపీ అధిష్ఠానం రెండు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించినా ఏపీ విషయంలో మాత్రం తర్వాత చూద్దాం అన్నట్లుగా వదిలేసింది. దీంతో సోము వీర్రాజు గంగవెర్రులెత్తుతున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొత్తగా రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిత్యానందరాయ్ - ఢిల్లీ అధ్యక్షుడిగా మనోజ్ తివారీని ఎంపిక చేసింది. వీటితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా ఫిల్ చేస్తారని అనుకున్నా దానిపై ఏమీ ప్రకటన రాలేదు.

నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ కంభంపాటి హరిబాబు పదవీకాలం ఎప్పుడో పూర్తయింది. ఆయన్ను మళ్లీ కొనసాగించాలని వెంకయ్యనాయుడు - మిత్ర పక్షం టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఏపీలో కాపుల ఓట్లు కీలకం కానున్న తరుణంలో సోము వీర్రాజుకు ఛాన్సివ్వాలన్న వాదనా ఉంది. అదే అర్హతగా వీర్రాజు పై స్థాయిలో లాబీయింగ్ చేసి పదవి అంచుల వరకు వెళ్లారు. కానీ.. చంద్రబాబుపై నిత్యం విరుచుకుపడే వీర్రాజును ఆ పదవిలో చూడడం టీడీపీకి ఇష్టం లేదు. దీంతో వెంకయ్య సహకారంతో వీర్రాజును ఎలాగైనా ఆ పదవి అందుకోకుండా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ పితలాటకం కారణంగా బీజేపీ అధిష్ఠానం కూడా ఏపీ విషయంలో వాయిదాలు వేస్తూపోతోంది. ఇంతకుముందు పలు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించినప్పుడు కూడా ఏపీని పక్కనపెట్టింది, ఇప్పుడూ అదే పనిచేసింది. దీంతో వీర్రాజు పని అంతే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. హరిబాబు - వీర్రాజులు కాకుండా చివరకు వేరే నేతలకు ఆ పదవిని కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News