వీర్రాజు టార్గెట్ మారిందండోయ్‌!

Update: 2017-04-11 17:48 GMT
బీజేపీకి చెందిన ఏపీ కీల‌క నేత‌, ఆ పార్టీ త‌ర‌ఫున ఏపీ శాస‌న‌మండ‌లిలో స‌భ్యుడిగా ఉన్న సోము వీర్రాజు ఏది మాట్లాడినా సంచ‌ల‌న‌మే. నిన్న‌టిదాకా త‌మ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న అధికార టీడీపీపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న చంద్ర‌బాబు అండ్ కోకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. బాబు పాల‌న‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతోంద‌ని, మ‌ద్యం వ్యాపారం రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతోంద‌ని, దానిని క‌ట్ట‌డి చేయ‌డంలో బాబు స‌ర్కారు ఘోరంగా విఫల‌మైందంటూ నేరుగా చంద్ర‌బాబునే టార్గెట్ చేసుకుని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సోము వీర్రాజు... ఒకానొక స‌మ‌యంలో బీజేపీ, టీడీపీల మ‌ధ్య మైత్రి తెగిపోవ‌డం ఖాయ‌మేనా అన్న అనుమానాల‌ను కూడా క‌లిగించార‌నే చెప్పాలి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ, బీజేపీల మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధంతో నాడు ప‌రిస్థితి తారాస్థాయికే చేరింద‌న్న వాద‌న‌లు వినిపించాయి. అయితే మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ, ఆ పార్టీ నేత‌ల విష‌యంలో కాస్తంత జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని, అస‌లు ఆ పార్టీ నేత‌ల విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా ఉంటేనే మంచిదంటూ చంద్ర‌బాబు తెలుగు త‌మ్ముళ్ల‌కు ఆదేశాలు జారీ చేయ‌డంతో నాడు ఆ వివాదం ముగిసిపోయింది. ఈ క్ర‌మంలో వీర్రాజు కూడా టీడీపీ నేత‌ల‌పై అంత‌గా విరుచుకుప‌డ‌టం లేదు. అయితే కాసేప‌టి క్రితం శ్రీకాకుళంలో మీడియా ముందుకు వ‌చ్చిన వీర్రాజు... చంద్ర‌బాబుకు బ‌దులుగా... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు చెందిన ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ దిగ్విజ‌య్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవ‌ల విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన డిగ్గీరాజా... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా బీజేపీ స‌ర్కారు నాట‌కాలాడుతోంద‌ని విరుచుకుప‌డ్డారు. ఈ వ్యాఖ్య‌ల‌ను ఆస‌రా చేసుకుని డిగ్గీరాజాపై వీర్రాజు ఓ రేంజిలో ఫైర‌య్యారు. అస‌లు త‌మ పార్టీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే స్థాయి డిగ్గీరాజాకు లేద‌న్న వీర్రాజు... మ‌ధ్యప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో డిగ్గీరాజాకు డిపాజిట్ కూడా ద‌క్క‌ని విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేని నేత త‌మ పార్టీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. మ‌రి వీర్రాజు కామెంట్ల‌పై డిగ్గీరాజా ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News