చాగంటి ఇష్యూలోకి ఐలయ్యను తెచ్చిన వీర్రాజు

Update: 2017-01-22 04:26 GMT
ప్రముఖ అధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో భాగంగా యాదవుల్ని అవమానించే రీతిలో మాట్లాడారంటూ జరుగుతున్న రచ్చతెలిసిందే. తమ మనోభావాలు దెబ్బ తీసేలా ప్రసంగించిన చాగంటిపై పలుచోట్ల కేసులు పెట్టటం.. పలు యాదవ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొందరు యాదవ నాయకులు చాగంటి వారి ఇంటికి వెళ్లి.. ఆయన చేత క్షమాపణలు చెప్పించటం తదితర పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా వేగంగా సాగిపోయాయి.

ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన చాగంటి కోటేశ్వరరావు ఇకపై తాను ప్రవచనాల్ని చెప్పకూడదని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై రాజకీయ నేతలు ఎవరూ పెద్దగా జోక్యం చేసుకున్నది లేదు. తమను కించపరిచేలా మాట్లాడారంటూ తాడేపల్లిగూడెంలో కొందరు యాదవ సంఘాల నేతలు చాగంటిని ప్రశ్నించటం.. తనకు వారిపై ఎలాంటి వ్యతిరేకత లేదు సరికదా.. యాదవుల్ని ఆత్మీయ ఆలింగనం చేసుకోవటానికైనా తాను సిద్దమేనని ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. చాగంటి వారు ఇకపై ప్రవచనాలు చెప్పరన్న మాట ఆయన అభిమానుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన ప్రవచనాల కారణంగా దేశ.. విదేశాల్లోని తెలుగువారికి సంస్కృతి.. సంప్రదాయం.. హైందవ ధర్మాలు తెలుస్తున్నాయని.. ఆయన కానీ ప్రవచనాలు చెప్పకుంటే తెలుగు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్న వాళ్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఈ అంశంపై తాజాగా రియాక్ట్ అయ్యారు. చాగంటిని తప్పు పడుతన్న వర్గంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన చెప్పిన విషయాన్నిగుర్తుచేసిన సోము వీర్రాజు.. కంచె ఐలయ్య శ్రీకృష్ణుడ్ని వ్యభిచారి అని అన్నారని.. ఇతర మతస్థులు దేవుడికి అంతమంది భార్యలా అని ఎద్దేవా చేశారని.. మరి.. వాళ్ల మీద కేసులు పెట్టలేదే? అరెస్ట్ చేయలేదే?అని ప్రశ్నించారు. చాగంటి వారు చేసిన వ్యాఖ్యల్ని కొన్ని ఛానళ్లు పదే పదే క్లిప్పింగ్స్ లో ప్రచారం చేయటాన్నిసోమువీర్రాజు తప్పు పట్టారు. చాగంటి వారిపై నడుస్తున్న వివాదంలోకి ఐలయ్యను  తీసుకొచ్చేలా ఉన్న సోము వీర్రాజు మాటలు మరెలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News