బతికున్నపుడు ఎలా చూసుకుంటారో తెలియదుగానీ.. చాలా మంది తమ దగ్గరి వాళ్లు చనిపోయినపుడు మాత్రం ఎంతో ప్రేమను చూపిస్తారు. ఎవరైనా మరణిస్తే వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా భౌతికకాయాన్ని పాతిపెట్టడమో - దహన సంస్కారాలు నిర్వహించడమో చేస్తారు. ఇంకొందరు ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా వీడ్కోలు పలుకుతారు. ఇలాగే నైజీరియాలోనూ ఓ కోటీశ్వరుడు తన తండ్రికి ఖరీదైన వీడ్కోలు పలికాడు. అజుబుకె అనే ఆ వ్యక్తి చేసిన ఈ పనిని కొందరు తీవ్రంగా విమర్శిస్తుండగా.. మరికొందరు స్వాగతిస్తున్నారు. ఇంతకీ అతను చేసిన పనేంటో తెలుసా? బీఎండబ్ల్యూ ఎక్స్6 కారులో పడుకోబెట్టి తండ్రిని పూడ్చి పెట్టడం.
తాను ఎప్పటికైనా ఖరీదైన కారును కొంటానని అజుబుకి తరచూ తన తండ్రితో చెప్పేవారు. తండ్రి మరణంతో వెనువెంటనే బీఎండబ్ల్యూ కారును కొన్న అజుబుకి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేయడం చూపరులకు విస్తుగొలుపుతోంది. ఔను తన తండ్రి శవాన్ని సాధారణ శవపేటికలో కాకుండా కోటి రూపాయల విలువైన బీఎండబ్ల్యూ ఎక్స్6 అనే కారులో పడుకోబెట్టి పూడ్చి పెట్టాడు. అంతేకాకుండా తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్ నావిగేషన్ ను ఏర్పాటు చేశాడట. ఈ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారిపోయింది. అయితే ఎక్కువ మంది అజుబుకె చేసిన పనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎంత డబ్బున్న వాళ్లయితే మాత్రం ఇలా అనవసరంగా డబ్బు తగలేస్తారా అంటూ మండిపడ్డారు. నీకు మీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే వాళ్లు బతికున్నపుడు ఇలా ఖరీదైన కార్లలో తిప్పి.. చనిపోయినపుడు శవపేటికలో పెట్టి పూడ్చు. అంతే తప్ప ఇదీ మరీ మూర్ఖత్వం అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.